Share News

పంట నష్టపరిహారం చెల్లించాలి : జూలకంటి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:54 PM

పంటలు ఎండిన రైతులకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

పంట నష్టపరిహారం చెల్లించాలి : జూలకంటి
సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ రూరల్‌, ఏప్రిల్‌ 3: పంటలు ఎండిన రైతులకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ యాసంగి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.500ల బోనస్‌ ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు కూడా చెల్లించాలన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు తగిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వరితో పాటు పండ్ల తోటలు కూడా ఎండిపోతున్నాయని చెప్పారు. రెవిన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సంబంధిత అధికారులతో టీంలు ఏర్పాటు చేసి ఎండిపోయిన పండ్ల తోటలను అంచనా వేసి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సీహెచ్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:54 PM