Share News

పోలీసు కేసులకు భయపడి ప్రేమజంట ఆత్మహత్య

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:57 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాంతో తమ తమ కుటుంబాలకు తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్‌ కావడంతో

పోలీసు కేసులకు భయపడి ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఉత్తరా్‌సపల్లిలో ఘటన

కొందుర్గు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాంతో తమ తమ కుటుంబాలకు తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్‌ కావడంతో పోలీసు కేసులు అవుతాయని భయపడి ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొందుర్గు మండలంలోని ఉత్తరా్‌సపల్లికి చెందిన కావలి బాలకిష్టయ్య-లక్ష్మమ్మలకు దంపతులకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్న వయసులోనే బాలకిష్టయ్య చనిపోవడంతో లక్ష్మమ్మ కూలి పనుల చేస్తూ పిల్లలను పెంచింది. కూతుళ్లకు పెళ్లి చేసి కొడుకు శ్రీకాంత్‌(24)తో కలిసి ఉంటోంది. పదో తరగతి వరకు చదివిన శ్రీకాంత్‌ షాద్‌నగర్‌లోని ఓ కిరాణ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఆరునెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో బండ్లగూడ జాగీర్‌ కిస్మత్‌పురకు చెందిన ఓ పదోతరగతి బాలిక(16)పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బాలిక మైనర్‌ కావడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవని గతనెల 27న యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మార్చి 30న శ్రీకాంత్‌ వాళ్ల గ్రామానికి రాగా, గ్రామస్థులు మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు పోలీసు కేసు నమోదవుతుందని చెప్పారు. బాలికను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టమని అన్నారు. దాంతో కేసులకు భయడి, కలిసి ఉండలేమని భావించి శ్రీకాంత్‌, ఆ బాలిక గతనెల 30న గ్రామ సబ్‌స్టేషన్‌ వద్ద పురుగు మందు తాగారు. వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి బాలిక మృతి చెందగా, మంగళవారం తెల్లవారుజామున శ్రీకాంత్‌ చనిపోయాడు. శ్రీకాంత్‌ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 02:57 AM