Share News

కొనేందుకు కొర్రీలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:13 AM

రైతే రాజు అన్నారు. దేశానికి వెన్నుముక అన్నదాతే అన్నారు. కానీ అదే రైతుకు వెన్ను విరుగుతోంది. ప్రకృతి విలయతాండవానికి, తెగుళ్ల బెడదకు, నకిలీల మోసాలకు అడ్డుకట్ట వేసి.. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. తీరా విక్రయిద్దామంటే అడుగడుగునా ముంచుతున్నారు. పొలం నుంచి పంటను మార్కెట్‌కు తెస్తే తేమ, తాలు పేరుతో మిల్లర్లు, అధికారుల మాయాజాలంలో బిక్కమొఖం వేస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షించే ఓపిక లేక, వారు చెప్పిన ధరకు విక్రయిస్తూ ఇంటిబాట పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే ధాన్యానికి రెండు చోట్ల రెండు ధరలు పలకడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.

కొనేందుకు కొర్రీలు

రైతే రాజు అన్నారు. దేశానికి వెన్నుముక అన్నదాతే అన్నారు. కానీ అదే రైతుకు వెన్ను విరుగుతోంది. ప్రకృతి విలయతాండవానికి, తెగుళ్ల బెడదకు, నకిలీల మోసాలకు అడ్డుకట్ట వేసి.. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. తీరా విక్రయిద్దామంటే అడుగడుగునా ముంచుతున్నారు. పొలం నుంచి పంటను మార్కెట్‌కు తెస్తే తేమ, తాలు పేరుతో మిల్లర్లు, అధికారుల మాయాజాలంలో బిక్కమొఖం వేస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షించే ఓపిక లేక, వారు చెప్పిన ధరకు విక్రయిస్తూ ఇంటిబాట పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే ధాన్యానికి రెండు చోట్ల రెండు ధరలు పలకడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.

సూర్యాపేట సిటీ, ఏప్రిల్‌ 11: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం విక్రయానికి రైతుల తాకిడి పెరుగుతోంది. గ్రామాల్లో ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి, ఇబ్బందులు పడలేని రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. మరికొంత మంది రైస్‌ మిల్లల వద్దకు ధాన్యం తీసుకెళితే అడ్డుగోలుగా ధర తగ్గించి, రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. క్వింటాకు రూ.200 నుంచి రూ.300 వరకు ధర తగ్గించి రైతులను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయలేక రైస్‌ మిల్లులకు విక్రయించి నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలన్న ఆలచోనతో రైతులు మార్కెట్‌లో లాభానికి ధాన్యం విక్రయిద్దామంటే అక్కడ కూడా రైతులను మార్కెట్‌ అధికారులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. టోకెన్‌ వ్యవస్థను అమలుచేసి ధాన్యం రాకను అడ్డుకుంటున్నారు. ఈ నెల 10 నుంచి మార్కెట్‌లో టోకెన్‌ విధానం అమలు చేస్తున్నారు. ప్రతీరోజు మార్కెట్‌కు 20వేల నుంచి 30వేల బస్తాలు వచ్చే విధంగా టోకెన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. మార్కెట్‌ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు (రైస్‌మిల్లర్లు), రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధాన్యంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు టోకెన్‌ లేకపోవడంతో మార్కెట్‌ నుంచి వెనుదిరిగిపోతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రోజుకు లక్ష బస్తాలు వచ్చినా తాము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఓ వైపు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోని రైస్‌ మిల్లర్లు తెలియజేస్తున్నారు. మార్కెట్‌కు ఽభారీగా ధాన్యం వచ్చే అవకాశాలు ఉండటంతో వాటి కాంటాలు, ఎగుమతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టోకెన్‌ విధానం ప్రవేశపెట్టినట్లు మార్కెట్‌ అధికారులు పేర్కొంటున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ అధికారులు టోకెన్‌ విధానం ప్రవేశపెట్టాడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టోకెన్‌ విధానంవల్ల టోకెన్‌ ఉన్న రైతులు మాత్రమే మార్కెట్‌లో ధాన్యం విక్రయించడానికి వీలుంటుంది. అయితే టోకెన్‌ లేని రైతులను ఎట్టి పరిస్థితిలో మార్కెట్‌లోకి అనుమతించరు. మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న కమీషన్‌దారులు గత సంవత్సరం వారు చేసిన వ్యాపార లావాదేవీల ఆధారంగా మార్కెట్‌ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. అంటే ఒక కమీషన్‌దారుడికి రెండు నుంచి మూడు టోకెన్ల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అంటే ఒక కమీషన్‌దారుడి వద్దకు ముగ్గురు రైతుల కంటే ఎక్కువమంది రావడానికి అవకాశం లేదు. పండించిన పంటను స్వేచ్ఛగా మార్కెట్‌లో విక్రయించే వెసులుబాటు లేకుండా మార్కెట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టోకెన్ల కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌ అధికారులు, కమిటీ సభ్యులు, రాజకీయ నేతల చుట్టూ టోకెన్ల కోసం ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కార్యాలయానికే పరిమితమైన అధికారులు, సిబ్బంది

పేట మార్కెట్‌లో ఒక కార్యదర్శి, ఒక అసిస్టెంట్‌ కార్యదర్శి, గ్రేడ్‌ టూ కార్యదర్శి, ఐదుగురు సూపర్‌వైజర్లు, ఒక యూడీసీ, వీరందరూ రెగ్యులర్‌ ఉద్యోగులు. వారిలో ఏ ఒక్కరూ కూడా మార్కెట్‌ యార్డులలో పర్యవేక్షణ చేయరని కమీషన్‌దారులు ఆరోపిస్తున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కార్యాలయానికే పరిమితమవుతారనే విమర్శలున్నాయి. రైతులకు ఖరీదుదారులు చెల్లిస్తున్న ధరలపై పర్యవేక్షణ చేయడం లేదని పలువురు ఆరోస్తున్నారు.

రోజుకు 30వేల బస్తాల వరకే అనుమతి

ఈ నెల 10 నుంచి ప్రవేశపెట్టిన టోకెన్‌ విధానం వల్ల మార్కెట్‌కు 30వేల బస్తాల కంటే ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం లేదు. పేట మార్కెట్‌ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. మార్కెట్‌కు రోజుకు 50వేల నుంచి 70వేల బస్తాలు వచ్చినా వాటిని కాంటావేసి, ఎగుమతి చేసే వీలుంది. గత సీజన్‌లో రోజుకు 50 వేల బస్తాలకు వరకు వచ్చినా గత మార్కెట్‌ కార్యదర్శి టోకెన్‌ విధానం తీసుకురాలేదు. ఇటీవల మార్కెట్‌ కార్యదర్శి టోకెన్‌ విధానం ప్రవేశపెట్టడం ఏమిటని రైస్‌ మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. 33 ఎకరాలకు పైగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌లోకి కేవలం 30వేల బస్తాలకే టోకెన్‌ విధానం ప్రవేశపెట్టడం మార్కెట్‌ అధికారుల అసమర్థతకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మార్కెట్‌ కార్యదర్శి మార్కెట్‌లో ఉన్న సిబ్బందితో సమన్వయం చేస్తే రోజుకు లక్ష బస్తాలు వచ్చినా ఎలాంటి టోకెన్‌ విధానం లేకుండానే వ్యాపారం నిర్వహింవచ్చునని రైస్‌ మిల్లర్లు అంటున్నారు.

ధాన్యం కొనుగోలుకు సిద్ధం

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపార అనుమతులు (లైసెన్స్‌) పొందిన కమీషన్‌దారులు 125 మంది, రైస్‌ మిల్లుల నుంచి లైసెన్స్‌లు ఉన్న మిల్లర్లు సుమారు 17 మందికి పైగా ఉన్నారు. ఈ 17 మంది రైస్‌ మిల్లర్లు మార్కెట్‌లో టోకెన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్‌కు రోజుకు ఎన్ని బస్తాలు వచ్చినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. మార్కెట్‌కు జోరుగా ధాన్యం వస్తున్న తరుణంలో టోకెన్‌ విధానం ప్రవేశపెట్టడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.

టోకెన్లకోసం రాత్రి వరకూ వేచి చూశాం : కొరవి నాగమల్లు, పాతర్లపహాడ్‌ గ్రామం, ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం

ఈ నెల 10వ తేదీన మార్కెట్‌లో ధాన్యం విక్రయించడానికి రాత్రి పొద్దుపోయే వరకూ టోకెన్ల కోసం తిరిగాం. అడ్తి అసోసియేషన్‌ వాళ్లు మీ కమీషన్‌దారుడికి టోకెన్లు ఇచ్చామన్నారు. కమీషన్‌దారుడి దగ్గరకు పోతే తనకు రెండు టోకెన్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. టోకెన్‌ విధానం వల్ల టోకెన్ల కోసం కమీషన్‌దారుల చుట్టూ తిరిగాల్సి వస్తోంది. ఆర్‌-64 రకం ధాన్యానికి రూ.1,680ధర వేశారు. బయట ధరలతో పోల్చితే క్వింటాకు రూ.300 వరకు నష్టపోయాను.

మార్కెట్‌ నిబంధనలు మార్చలేం : బీవీ రాహుల్‌, మార్కెట్‌ కార్యదర్శి, సూర్యాపేట

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో టోకెన్‌ విధానం వద్దు అనడానికి వాళ్లు (రైతులు, రైస్‌ మిల్లర్లు) ఎవరు. వాళ్లు టోకెన్‌ విధానం వద్దు అంటే కుదరదు. వాళ్లకోసం మార్కెట్‌ నిబంధనలను మార్చలేం. మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తుంటే వాటిని కట్టడి చేయడంకోసం టోకెన్‌ విధానం తీసుకొచ్చాం. ధాన్యం కాంటాలు, ఎగుమతులు సజావుగా సాగాలంటే టోకెన్‌ విధానం అవసరం. ఎప్పటినుంచో మార్కెట్‌లో టోకెన్‌ విధానం ఉంది. ఆవిధానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం.

ఒకే ధాన్యానికి రెండు ధరలా?

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

రైతుల కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతోంది. ఎంతో కష్టపడి పంటలు పండిస్తే అది చేతికొచ్చాక, ధాన్యాన్ని విక్రయించే సమయంలో నష్టపోతున్నారు. ఇలా ప్రతీ సీజన్‌లో నష్టపోతూనే ఉన్నారు. ఒక సీజన్‌లో ధర బాగా వచ్చిందని చింట్ల రకాన్ని సాగు చేస్తే, మిల్లర్లు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈసారి శ్రీరాంసాగర్‌ రెండో దశ వారబంది తరహాలో కాల్వలకు నీటిని విడుదల చేశారు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరందలేదు. ఒక రైతు నాలుగు ఎకరాలు సాగుచేస్తే అందులో ఒక ఎకరం ఎండిపోయింది. బోర్లు, బావుల కింద సేద్యం చేసిన రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగర్‌ ఎడమ కాల్వ నీటి విడుదల చేయక పోవడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు నష్టపోయారు. కనీసం రెండు తడులకు నీటిని విడుదల చేసినా కొంత గట్టెక్కేవారు. సూర్యాపేట జిల్లాలో యాసంగి వరిసాగు విస్తీర్ణం 3,81,000 ఎకరాల్లో ఉండగా, ధాన్యం ఉత్పత్తి 3,61,445 మెట్రిక్‌ టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు ధాన్యం దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 281 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం ఏ-గ్రేడ్‌ రకానికి క్వింటాకు రూ.2203 మాత్రమే లభిస్తుంది. ధాన్యం గ్రేడ్‌ సాధారణ రకానికి రూ.2183 మాత్రమే లభిస్తుంది. దీంతో చింట్లు అనే ధాన్యం రకానికి విక్ర యిం చడానికి అవకాశం లేకుండా పోయింది. చింట్లు ఽతప్పనిసరిగా బయట మార్కెట్‌లోనే విక్రయించాల్సి వస్తుంది.

ఉమ్మడి జిల్లాలోనే చింట్లకు రెండు రకాల ధరలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చింట్లకు రెండు రకాల ధరలు మిల్లర్లు చెల్లిస్తున్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన మిల్లర్లు చింట్ల క్వింటాకు ధర రూ.2200 మాత్రమే చెల్లిస్తుండగా అదే మిర్యాలగూడలోని మిల్లర్లు క్వింటాకు ధర రూ.2650 చెల్లిస్తున్నారు. గత సంవత్సరం మంచి ధర లభించడంతో సూర్యాపేట జిల్లాలో దాదాపు 1.50లక్షల ఎకరాల్లో చింట్లు సాగు చేశారు. తీరా విక్రయించడానికి వచ్చేసరికి గ్రేడ్‌-ఏ రకానికి ఏవిధంగా మద్దతు ధర చెల్లిస్తున్నారో అదేవిధంగా చెల్లిస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వాస్తవానికి చింట్లు రకం బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లోనే మంచి డిమాండ్‌ ఉంది. గత సంవత్సరం క్వింటా రూ.4వేలు ధర కూడా పలికింది. ఒక సీజన్‌లో ధాన్యానికి ధర పలికితే మరో సీజన్‌లో అమాంతం పడిపోతుంది.

మిల్లర్లదే ఇష్టారాజ్యం

ఉమ్మడి జిల్లాలో మిల్లర్లదే ఇష్టారాజ్యంగా మారింది. చింట్ల విక్రయానికి రైతులు వస్తే క్వింటాకు రూ.2200 మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేగాక ధాన్యం ఆరబెట్టాలని, ఆరబెట్టిన ధాన్యం తీసుకొస్తే నూక బాగా అవుతుందని కొర్రీలు పెడుతున్నారు. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంపై అజమాయిషీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. ధర తక్కువగా ఉన్నప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించడానికి ఇష్టపడని రైతులు ఇక్కడే విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఒక మిల్లర్‌కు బీబీగూడెంలో ఒక మిల్లు ఉండగా, మిర్యాలగూడలో మరో మిల్లు ఉంది. సూర్యాపేటలోని మిల్లులో క్వింటా చింట్లకు రూ.2200 ధర పలికితే అదే మిర్యాలగూడ మిల్లులో రూ.2600 నుంచి రూ.2650 దాకా ధర చెల్లిస్తున్నారు. ప్రతీ మిల్లులో రోజుకు 50ట్రాక్టర్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఒక ట్రాక్టర్‌కు 50 క్వింటాళ్ల ధాన్యం వస్తుంది. ఈ నేపథ్యంలో క్వింటాకు రూ.400 తక్కువగా కొనుగోలు చేయడం వల్ల కేవలం ఒక ట్రాక్టరుకు రూ.20వేలు అదనంగా ఆదాయం మిల్లర్లకు లభిస్తుంది. రోజుకు 50ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే సుమారు రూ.10లక్షల దాకా రైతులనుంచి దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యంగా మార్చి రైస్‌ మిల్లర్లు విక్రయించుకొని లాభాలు గడిస్తారు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఒక చోట ఒక ధర ఉంటే మరోచోట మరో ధర ఉండడం గమనార్హం.

ఐరి్‌షతో అక్రమాలకు అడ్డుకట్ట పడేనా...?

మోత్కూరు: ధాన్యం విక్రయాల్లో దళారీ వ్యవస్థను రూపుమాపాలన్న సంకల్పంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐరిష్‌ (కనుపాప) విధానం అమల్లోకి తెచ్చింది. గతంలో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి నేరుగా బిల్లు చేయించుకునే వారు. కొంతకాలం తర్వాత రైతుల కన్నా ఎక్కువగా దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి విక్రయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా దళారీ వ్యవస్థకు అడ్డకట్ట పడలేదని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా ఐరిష్‌ విధానాన్ని అమలు చేస్తోంది. స్థానిక అధికారుల్లో నిజాయితీ లోపించినప్పుడు ఏ విధానమూ దళారీ వ్యవస్థను ఆపలేదని, ఐరిష్‌ విధానంతో కొందరు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 929 కేంద్రాలు ఏర్పాటు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐకేపీ, సింగిల్‌ విండోల ద్వారా 929 ధాన్యం కేంద్రాలు తెరిచి 16.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 323 కేంద్రాల ద్వారా 5.25లక్షల మెట్రిక్‌ టన్నులు, సూర్యాపేట జిల్లా 236 కేంద్రాల ద్వారా 3.54లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్లగొండ జిల్లాలో 370 కేంద్రాల ద్వారా 7.56లక్షల మెట్రిక్‌ టన్నులు కొననున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మిల్లులు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌ను ఖరారు చేశారు. అయినా మోత్కూరు మండలంలో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు రాశులను పరిశీలించారే తప్ప కాంటాలు మాత్రం వేయడం లేదు. కొన్నిచోట్ల ఇంకా కేంద్రాలే ప్రారంభించలేదు.

ప్రతి రైతూ కేంద్రానికి రావాల్సిందే

గతంలో రైతు ఎక్కడ ఉన్నా రైతు ఆధార్‌, బ్యాంకు ఖాతా జీరాక్స్‌లు కొనుగోలు కేంద్రంలో ఇచ్చి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్‌ చెబితే సరిపోయేది. ఓటీపీ ట్యాబ్‌లో నమోదు చేసి ధాన్యం కొని బిల్లు చేసేవారు. ఈ విధానంతో ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొన్న ధాన్యాన్ని తమకు అనుకూలంగా ఉన్న రైతుల పేరున విక్రయిస్తున్నారన్న భావన ప్రభుత్వంలో ఉంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఐరిష్‌ విధానం అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విధానంలో ప్రతి రైతూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావాల్సిందే. ఆయన్ను ఐరి్‌షతో గుర్తించాకే ధాన్యం కొని బిల్లు చేస్తారు.

కౌలు రైతులకు మరీ ఇబ్బంది

కౌలు రైతులు కూడా ధాన్యం విక్రయించుకోవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక అధికారులు అది సాధ్యపడదంటున్నారు. భూమిని కౌలుకు ఇచ్చిన రైతు నుంచి కౌలు పత్రం తీసుక వస్తేనే కౌలురైతు పేరున ఓపీఎంఎస్‌ (ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంటు సిస్టమ్‌)లో పంట నమోదు చేస్తామని ఏఈవోలు చెబుతున్నారు. క్రాప్‌ బుకింగ్‌ జరిగినప్పుడే రైతుల పేరున పంట నమోదు చేశామని, ఇప్పుడు ఆ పంటను కౌలు రైతు పేరున మార్చాలంటే కౌలు పత్రం కావాలని, తాము అడిగినప్పుడు రైతు కూడా తన భూమిని కౌలుకు ఇచ్చానని చెప్పాలంటున్నారు. ఇప్పటి వరకూ ఏ రైతూ కౌలు రైతుకు కౌలు పత్రం ఇవ్వడంలేదు. ఇక ముందు కూడా ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. కౌలు రైతు గుర్తింపు అనేది ఓ చిక్కుముడి సమస్య. అది ఇప్పట్లో తేలేది కాదు. దూర ప్రాంతాల్లో, ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల్లో ఉన్న రైతులు తాము ధాన్యం విక్రయించినప్పుడు కేంద్రానికి రమ్మంటే వస్తారో లేదోనని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా వాస్తవ రైతుల్లోనూ కొందరికీ ఐరిష్‌ కాక ఇబ్బందులు తప్పవంటున్నారు. కంటిలో పొర వచ్చిన వారు, కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఐరిష్‌ ఇబ్బందేనంటున్నారు.

అన్ని కేంద్రాలకు ఐరిస్‌ కెమెరాలు సరఫరా

ఉమ్మడి నల్లగొండలో తెరిచిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ వారు ఐరిష్‌ కెమెరాలను అందించినట్టు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Apr 12 , 2024 | 12:18 AM