Share News

Yadadri Thermal Power Station : మాకేంటి!?

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:22 AM

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులకు బ్రేకు పడింది. పవర్‌ ప్లాంట్‌పై ఆధిపత్యంతోపాటు ఇక్కడి పనులను తమ అనుయాయులకు ఇప్పించుకోవడానికి స్థానిక ప్రజా ప్రతినిధి,

Yadadri Thermal Power Station  : మాకేంటి!?

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రంపై రాజకీయ క్రీనీడ.. నిలిచిన పనులు

మార్చిలో జరగాల్సిన రెండు ప్లాంట్ల

ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం

ప్లాంటు కాంట్రాక్టు సంస్థల్లో

బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నిహితులు

ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులూ

ఆ పార్టీ నాయకులకే..

వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక, కీలక నేతల ఒత్తిడి

గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ ‘వ్యవహారాలు’ జరపాలని డిమాండ్‌

నాలుగు నెలలుగా 2000 కోట్ల బిల్లులూ పెండింగ్‌

కాంట్రాక్టు సంస్థల లబోదిబో

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌..! రెండు యూనిట్లలో 90 శాతం పనులు పూర్తయ్యాయి!

మిగిలిన మూడు యూనిట్లలో 70 శాతం పనులు పూర్తయ్యాయి!

అంతా అనుకున్నట్లు జరిగితే.. వచ్చే నెల అంటే మార్చిలోనే రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలి!

వేసవి అవసరాలను తీర్చేలా మరో 1,600 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రావాలి!

కానీ, సివిల్‌ పనులను పూర్తిస్థాయిలో

నిలిపివేశారు. మిగిలిన పనులనూ నామమాత్రంగా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మార్చిలో ఈ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఇందుకు కారణం..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంటుపై రాజకీయ క్రీనీడ పడడమే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులకు బ్రేకు పడింది. పవర్‌ ప్లాంట్‌పై ఆధిపత్యంతోపాటు ఇక్కడి పనులను తమ అనుయాయులకు ఇప్పించుకోవడానికి స్థానిక ప్రజా ప్రతినిధి, మరో కీలక ప్రజా ప్రతినిధి చేస్తున్న ఒత్తిడితో పనులు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఽథర్మల్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి 2015 జూలై 8న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఒక్కోటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లను నిర్మించాల్సి ఉంది. బొగ్గు సరఫరా కోసం రైల్వే లైన్‌, ఆరు టీఎంసీల కృష్ణా నీటిని కూడా ప్లాంటు కోసం కేటాయించారు. ప్లాంటు నిర్మాణానికి తొలుత రూ.29,500 కోట్ల అంచనా వ్యయం వేయగా, తర్వాత దానిని రూ.34,500 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పనుల్లో భూసేకరణ వంద శాతం పూర్తవగా, పునరావాస కేంద్రాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. మార్చిలో రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని అధికార యంత్రాంగం సన్నాహాలు కూడా చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్‌ ప్లాంటులో పనులకు బ్రేక్‌ పడింది. 20 రోజులుగా సివిల్‌ పనులు పూర్తిగా స్తంభించాయి. నిజానికి, పవర్‌ ప్లాంట్‌ ప్రధాన కాంట్రాక్టు సంస్థ బీహెచ్‌ఈఎల్‌. కాంట్రాక్టును దీనికే జెన్‌కో కట్టబెట్టింది. బీహెచ్‌ఈఎల్‌ దానిని పనులవారీగా 20 వరకూ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చింది. వీటిలో కొన్ని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నేతలకు అనుకూలంగా వ్యవహరించాయని, వీటికి ఇసుక, కంకర, డస్టు సరఫరా కాంట్రాక్టులు కూడా బీఆర్‌ఎ్‌సకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అప్పటి ప్రజా ప్రతినిధులకు సన్నిహితులైన వారికే ఇచ్చారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధి, మరో కీలక ప్రజా ప్రతినిధి కలిసి ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులను ఆపివేయాలని ఇటీవల హెచ్చరించారు. దాంతో, వాటి సరఫరా నిలిపివేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు నేతల సూచనలతో కొన్ని కాంట్రాక్ట్‌ సంస్థలు తాజాగా ఇసుక, కంకర, డస్టు సరఫరాకు కొత్త వారితో ఒప్పందాలు చేసుకున్నాయని తెలుస్తోంది. మరోవైపు, కీలక ప్రజా ప్రతినిధి ఇటీవల ప్లాంటులో పనులు నిర్వహిస్తున్న అన్ని కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, తమకు ‘అనుకూలం’గా ఉండాలని, గత ప్రభుత్వంలో కొనసాగించినట్లే తమతో ‘వ్యవహారాలు’ కొనసాగించాలని, లేకపోతే కాంట్రాక్టులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. మిగిలిన కాంట్రాక్టులకు సంబంధించి కూడా తమ అనుయాయులతో ఒప్పందాలు చేసుకోవాలని కాంట్రాక్ట్‌ సంస్థల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. వీటన్నిటికీ తోడు, దాదాపు నాలుగు నెలలుగా భారీ మొత్తంలో బిల్లులు సైతం పెండింగ్‌లో పడి ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో, కాంట్రాక్టర్లు సివిల్‌ పనులను పూర్తిస్థాయిలో నిలిపివేశారు. సీసీ రోడ్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలు, ప్లాంటులో బాయిలర్లు, చిమ్నీల నిర్మాణాల్లో సీసీ పనులు, ఎర్త్‌ వర్క్స్‌, యాష్‌ పాండ్‌ నిర్మాణం తదితర పనులన్నీ నిలిచిపోయాయి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ తదితరాలు మాత్రం నామమాత్రంగా కొనసాగుతున్నాయి. పనుల్లో మెజార్టీ భాగం ఆగిపోవడంతో ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది సైతం అవస్థలు పడుతున్నారు. అయితే, ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టామని, రూ.2 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ క్లియర్‌ చేయకుండా ఇలాగే సతాయిస్తే భవిష్యత్తులో పనులు కొనసాగించలేమని కాంట్రాక్ట్‌ సంస్థలు ఉన్నతాధికారులకు తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 12 , 2024 | 03:22 AM