Share News

సచివాలయ నిర్మాణం.. రికార్డుల్లో వివరాలు తారుమారు?

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:21 AM

కొత్త సచివాలయ నిర్మాణ అంచనా వ్యయం రెండింతలు కావడంపై కాంగ్రెస్‌ సర్కారు ఆరా తీస్తుండడంతో.. ఆర్‌అండ్‌బీ శాఖలోని కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే సూపరెంటెండింగ్‌ ఇంజనీరు(ఎ్‌సఈ) స్థాయిలో ఇద్దరు అధికారులు స్వచ్ఛంద

సచివాలయ నిర్మాణం.. రికార్డుల్లో వివరాలు తారుమారు?

ఆర్‌అండ్‌బీ అధికారుల్లో హడల్‌

ఇద్దరు ఎస్‌ఈ స్థాయి అధికారుల వీఆర్‌ఎస్‌

ఉన్నతాధికారి వద్ద సీల్డ్‌ రికార్డులు

నిర్మాణం పూర్తయి 11 నెలలు.. ఇప్పటికీ పూర్తికాని క్వాలిటీ చెకింగ్‌

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయ నిర్మాణ అంచనా వ్యయం రెండింతలు కావడంపై కాంగ్రెస్‌ సర్కారు ఆరా తీస్తుండడంతో.. ఆర్‌అండ్‌బీ శాఖలోని కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే సూపరెంటెండింగ్‌ ఇంజనీరు(ఎ్‌సఈ) స్థాయిలో ఇద్దరు అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) చేయగా.. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం ఓ కీలక అధికారి ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్నారని, ఆ క్రమంలో రికార్డుల్లో ఆయా అంశాలను నమోదు చేయాలని అధికారులు, ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది. అప్పట్లో సచివాలయ నిర్మాణంలో సదరు అధికారి కీలకం కావడంతో.. వీరంతా ఆయన చెప్పినట్లుగా విన్నారు. సచివాలయ నిర్మాణంపై సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తులు వచ్చినా.. వాటికి పాత జీవో(రూ.617 కోట్లు) ప్రకారం అంచనా వ్యయాన్ని చూపించారే తప్ప.. అసలు వ్యయాన్ని(రూ.1,140 కోట్లు) దాచిపెట్టారు. కాంగ్రెస్‌ సర్కారు ఈ విషయాన్ని గుర్తించాక.. సదరు ఉన్నతాధికారి ఆదేశాలతో రికార్డుల్లో వివరాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని అంశాలపై ఆరా తీస్తుండడం.. ఇతర శాఖల్లో రూల్స్‌ను అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటుండడంతో ఇంకా సర్వీస్‌ మిగిలి ఉన్నా.. వాలంటరీ రిటైర్మెంట్‌ దిశగా కొందరు అధికారులు, ఉద్యోగులు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఉన్నతాధికారి వద్ద రికార్డులు!

రేవంత్‌ సర్కారు సచివాలయ నిర్మాణ ఖర్చు రెట్టింపవ్వడంపై సీరియ్‌సగా దృష్టి సారించడంతో.. అధికారులు అందుకు సంబంధించిన రికార్డులకు సీల్‌ వేసినట్లు తెలుస్తోంది. ఆ ఫైళ్లను ఓ ఉన్నతాధికారి వద్ద భద్రతపరిచినట్లు సమాచారం. ఈ రికార్డులనే కొందరు అధికారులు తారుమారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సీళ్లను విప్పితే.. లోగుట్టు వెలుగులోకి వస్తుందని స్పష్టమవుతోంది. మరోవైపు.. సచివాలయంలాంటి బడా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉంటే.. పిల్లర్ల దశ నుంచి.. ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్ష జరిపించాల్సి ఉంటుంది. స్ట్రక్చరల్‌ ఇంజనీర్లతో దశల వారీగా ఈ పరీక్షలను నిర్వహించాలి. బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(బీఆర్‌ఎస్‌) అమలు సందర్భంలోనూ ప్రభుత్వం స్ట్రక్చరల్‌ ఇంజనీరు నివేదిక తప్పనిసరి అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే..! అయితే.. సచివాలయం నిర్మాణ సమయంలో కాదుకదా.. ప్రారంభోత్సవం జరిగి 11 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ నాణ్యత పరీక్షలు నిర్వహించలేదు. ప్రభుత్వం క్వాలిటీ చెకింగ్‌ చేస్తే.. నిర్మాణంలో లోపాలు కూడా బయటపడే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 26 , 2024 | 03:21 AM