Share News

తమ్ముడిగా భావించి.. సీఎంగా మద్దతిచ్చారు

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:10 AM

వయసులో అందరికంటే చిన్నవాడినైనా.. తమ్ముడిగా భావించి, ముఖ్యమంత్రిగా మద్దతిచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

తమ్ముడిగా భావించి.. సీఎంగా మద్దతిచ్చారు

సీనియర్ల ఎదుట రేవంత్‌ వ్యాఖ్య.. తెలంగాణను పునర్నిర్మిస్తాం

మూసీ పునరుద్ధరణలో భాగం కండి.. బిల్డర్ల సదస్సులో సీఎం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): వయసులో అందరికంటే చిన్నవాడినైనా.. తమ్ముడిగా భావించి, ముఖ్యమంత్రిగా మద్దతిచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే కీలకమైన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని, సహచర మంత్రుల సహకారంతో విధ్వంసమైన తెలంగాణను పునర్మిస్తామన్నారు. 31వ అఖిలభారత బిల్డర్ల సదస్సు శనివారం హెచ్‌ఐసీసీలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు, మెట్రోరైలు లాంటి కీలక నిర్మాణాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయన్నారు. బిల్డర్లు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘హైదరాబాద్‌కు మూసీనది ఒక ఆస్తి. 55 కిలోమీటర్ల పొడవునా.. మూసీనదిని అద్భుతంగా తీర్చిదిద్దనున్నాం. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులతోపాటు తెలంగాణ మెగా మాస్టర్‌ ప్లాన్‌-2050లో బిల్డర్లు భాగస్వాములవ్వాలి’’ అని సీఎం కోరారు. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించేందుకు బిల్డర్ల సహకారం అవసరమని, వారి అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. బిల్డర్ల సమస్యకు సర్కారు పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తమది ప్రజా ప్రభుత్వమని ముఖ్యమంత్రి, మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని, పాలన పారదర్శకంగా ఉంటుందని ఉద్ఘాటించారు. ఒక కాంట్రాక్టర్‌గా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని, వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వివరించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరంతోపాటు మూడు ప్రాజెక్టులను బలహీనంగా నిర్మించిన గత ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తాను కాంట్రాక్టర్‌ కాదని, కాంగ్రెస్‌ ఫైటర్‌, కార్యకర్త అన్నారు. గతంలో కాంట్రాక్టులు చేసేవాడినని, ఇప్పుడు తాను హైదరాబాదులో అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. బిల్డర్ల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10వేలకోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 28 , 2024 | 03:10 AM