Share News

కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దుపై పరిశీలన

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:39 AM

ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టుల విషయంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లలో జీవో నం.46 రద్దుపై పరిశీలన చేయాలని నిర్ణయించింది.

కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దుపై పరిశీలన

హైపవర్‌ కమిటీతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టుల విషయంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లలో జీవో నం.46 రద్దుపై పరిశీలన చేయాలని నిర్ణయించింది. పోలీస్‌ నియామకాల్లో జీవో నం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో హైపవర్‌ కమిటీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్‌ బాబు, ఏజీ సుదర్శన్‌ రెడ్డి, ఏఏజీ రంజిత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డి, నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఇతర ముఖ్య అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన అనేక అంశాలపై చర్చించారు. గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసి, సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తయిన పోస్టులతోపాటు, కొత్త నొటిఫికేషన్‌పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. 2022 మార్చిలో పోలీస్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. 2023 అక్టోబరులో 15,750 పోస్టులకు సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తయింది. కోర్టు కేసుల వల్ల నియామకాలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తైన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తైన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లకు జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్‌ సబ్‌కమిటీతో కొత్త నోటిఫికేషన్లలో జీవో రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

జీవో 46 అంటే..

జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీ పోస్టులకు సంబంధించిన జీవో ఇది. 2022 ఏప్రిల్‌ 4న ఈ ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాల వారీగా ఉండే 9 శాఖల పోస్టులను ఇందులో చేర్చారు. కానిస్టేబుల్‌ పోస్టులు కూడా ఈ జీవో కిందే భర్తీ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ జీవో అంశాన్ని తెరమీదకు తెచ్చారు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటుండడం, హైదరాబాద్‌-రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువ జనాభా ఉండడంతో వీరికే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని మిగతా జిల్లాల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవోను రద్దు చేసి కానిస్టేబుల్‌ పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 07:45 AM