Share News

రేవంత్‌ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్‌కు 30 కూడా వచ్చేవికావు

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:34 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్‌కు 30 కూడా వచ్చేవికావు

వంద రోజులు కాకముందే ప్రజల్లో వ్యతిరేకత

పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు

నాలుగు రోజులు అమెరికా వెళ్తే

కేటీఆర్‌ ఇక రాడంటూ ప్రచారం చేశారు

అంతరిక్షంలోకి వెళ్లినా ప్రజలు పిలవగానే వస్తా

24 ఏళ్ల తర్వాత కారు సర్వీసింగ్‌కు వచ్చింది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు

నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించి ఉంటే.. ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి, ‘లంకె బిందెలున్నాయని వస్తే.. ఖాళీ కుండలే ఉన్నాయి’ అని అనడం సీఎం హోదాకు తగదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు దారుణంగా మోసపోయారని, వంద రోజుల పాలన పూర్తి కాకముందే ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలతో వంచించిన కాంగ్రె్‌సకు పార్లమెంట్‌ ఎన్నికల్లో జనం గుణపాఠం చెబుతారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను సమాయత్తం చేసే దిశగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశాలకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఆ తర్వాత పదేళ్ల అధికారంలో బీఆర్‌ఎస్‌.. తెలంగాణ సమాజం కోసం, ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు విశేషమైన కృషి చేసిందని చెప్పారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఎంతవరకు వచ్చిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతుబంధు ఇవ్వకుండా తాత్సారం చేయడంతోపాటు వ్యవసాయ రంగానికి కరెంట్‌ కోత విధిస్తున్న విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో లక్షా 67 వేల మంది నిరుద్యోగులున్నారని, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో వారికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన యువతులు కోటి 24 లక్షల మంది ఉండగా, అభయహస్తం కింద రూ.2500 జమ చేస్తామన్న ఆంశం ఏమైందన్నారు. వంద రోజుల్లో 2లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటివరకు నోటిఫికేషన్‌ జారీ చేయకపోగా, కేసీఆర్‌ హయాంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించి తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజల హక్కులను ఢిల్లీకి తాకట్టు పెట్టిన ఘనత బీజేపీకి, రేవంత్‌రెడ్డికే దక్కిందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించకుండా మోసగించిన బీజేపీ.. కర్ణాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు ఆ హోదా ఎలా కల్పించిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిందని ఆరోపించారు.

24 ఏళ్ల తర్వాత సర్వీసింగ్‌కు కారు

కేసీఆర్‌ నాయక్వత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి, పదేళ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన కారు.. 24 ఏళ్ల తర్వాత సర్వీసింగ్‌కు వచ్చిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వంద స్పీడ్‌తో దూసుకెళ్లాలని, సంపూర్ణమైన మెజారిటీతో పార్టీని గెలిపించాలని అన్నారు. ‘ఒక్క సంవత్సరం కార్యకర్తలను కాపాడుకోండి.. ఆ తర్వాత వారే అండగా ఉంటారు’ అని పార్టీ నాయకులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పదవులు రాలేదన్న బాధ నాయకుల్లో ఉండొచ్చు కానీ, ప్రజల్లో మాత్రం లేదని తెలిపారు. కేసీఆర్‌ను దూరం చేసుకున్నందుకు అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. తాను నాలుగు రోజులు అమెరికాకు వెళ్తే.. కేటీఆర్‌ ఇక రాడంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రజల అభిమానం చూస్తుంటే అంతరిక్షంలోకి వెళ్లినా.. పిలిచిన వెంటనే వచ్చి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపై కాంగ్రెస్‌ నాయకులు ఇటుకలతో దాడి చేశారని, త్వరలోనే వాళ్లపై రాళ్లతో దాడి చేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. కాగా, ఇటీవల దాడికి గురైన న్యూస్‌లైన్‌ జర్నలిస్టు శంకర్‌కు ఏం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిజాలు చెప్పే గొంతుకలను మూయించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తుర్కయాంజాల్‌లో నివాసముండే శంకర్‌ను ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యేల మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ పరామర్శించారు.

నందిత కుటుంబానికి అండగా ఉంటాం

మారేడుపల్లి: రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని కేటీఆర్‌ ఆదివారం పరామర్శించారు. లాస్య నందిత తల్లి గీత, తోబుట్టువులు నమ్రత, నివేదితను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన రోజు తాను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయానన్నారు. సాయన్న అకాల మరణంతో వారి కుటుంబానికి తీరని లోటు జరిగిందని, ఇప్పుడు ఆయన కూతురు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర బాధాకరమని అన్నారు. లాస్య నందిత కుటుంబానికి పార్టీ పరంగా తాము అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కంటోన్మెంట్‌ మాజీ బోర్డు మెంబర్లు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 05:34 AM