Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

20 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:38 AM

‘కాంగ్రెస్‌ గృహజ్యోతి ఫేమస్‌.. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ బోగస్‌. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది’’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

20 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం

కాంగ్రెస్‌ గృహజ్యోతి ఫేమస్‌.. కేసీఆర్‌ 24గంటల కరెంట్‌ బోగస్‌

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బైక్‌పై పర్యటించి కేడర్‌లో జోష్‌ నింపిన మంత్రి

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ గృహజ్యోతి ఫేమస్‌.. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ బోగస్‌. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది’’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లాలోని కనగల్‌, తిప్పర్తి మండలాల్లో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఆయన.. పలువురు లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 4 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, మరో వారంలో ఐదో గ్యారెంటీ అయిన ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని అమలుచేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే 25వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌, మెగా డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ 90 రోజుల్లోనే అమలు చేస్తోందన్నారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఘనంగా పథకాలను అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. కాగా నల్లగొండ పట్టణంలోని పలు కార్యక్రమాలకు కోమటిరెడ్డి బైక్‌పై వెళ్లి హాజరయ్యారు. టూ వీలర్‌పై పర్యటిస్తూ.. పార్టీ కేడర్‌లో జోష్‌ నింపారు.

Updated Date - Mar 04 , 2024 | 07:49 AM