Share News

పార్టీని చీల్చి పాపాలు కడుక్కో!

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:30 AM

బీఆర్‌ఎ్‌సను చీల్చి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అధికార పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ కట్టబెడతామని హరీశ్‌రావుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ

పార్టీని చీల్చి పాపాలు కడుక్కో!

26 మందిని తెస్తే దేవాదాయ శాఖ!

హరీశ్‌కు రాజగోపాల్‌రెడ్డి బంపర్‌ ఆఫర్‌

మామ, బామ్మర్దిని నమ్ముకోకంటూ హితవు

పార్టీ సమావేశాలకు వెళ్తారు

అసెంబ్లీకి రమ్మంటే కాలు నొప్పంటారు

బీఆర్‌ఎస్‌ అధినేతపై చురకలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సను చీల్చి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అధికార పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ కట్టబెడతామని హరీశ్‌రావుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుందన్నారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావుకు బీఆర్‌ఎస్‌ సరైన పార్టీ కాదన్నారు. కేసీఆర్‌ నల్లగొండ సభ అట్టర్‌ ప్లాప్‌ అవుతుందని, సభకు జనం వచ్చే అవకాశమే లేదని రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుకు మేనమామ సాలు వచ్చిందని, అబద్ధాలు చెప్పడంలో మామను మించిపోయాడని అన్నారు. రాజగోపాల్‌ అంతకు ముందు అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇంతటి కీలకమైన సమావేశాలు జరుగుతుంటే కేసీఆర్‌ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ముఖ్యమంత్రి సీటు మాత్రమే కావాలా? ప్రతిపక్ష నేత సీటు అక్కర్లేదా? అని నిలదీశారు. తెలంగాణ నా రాజ్యం.. నేను రాజ్యానికి రాజు అన్నట్టుగాకేసీఆర్‌ భావిస్తున్నారని, ప్రజాస్వామ్యం అన్న సంగతి మరచిపోయారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు పార్టీ మీటింగ్‌లకు, పోరుబాటకు వెళ్లడానికి కుదురుతుందని, ప్రజాసమస్యలపై అసెంబ్లీకి రావాలంటే మాత్రం కాలునొప్పి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ కోసమే కొండపోచమ్మ రిజర్వాయర్‌ కట్టుకున్నారని ఆరోపించారు. సభకు రానప్పుడు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఎంత కష్టపడ్డా క్రెడిట్‌ కేసీఆర్‌కే దక్కుతుందని, మామను, బామ్మర్దిని నమ్ముకోకుండా కాంగ్రె్‌సకు మద్దతు తెలపాలని సూచించారు.

జయశంకర్‌ మాటనే వినలేదు

కృష్ణా జలాలపై అనవసరంగా కోర్టుకు వెళ్లి ఎనిమిదేళ్ల సమయాన్ని కేసీఆర్‌ వృథా చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కేంద్రానికి అన్ని కీలక బిల్లుల్లో సహకరించి కేసీఆర్‌ సాధించిందేంటని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణాపై ఏపీ రాయలసీమ ప్రాజెక్టు కడుతుంటే పదేళ్లుగా కేసీఆర్‌ సర్కారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నీటి పారుదల శాఖను విద్యాసాగర్‌కు ఇవ్వమని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెబితే కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. అప్పుడే ఇచ్చి ఉంటే కృష్ణా జలాల విషయంలో తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. చంద్రబాబును బలహీన పరచేందుకే కేసీఆర్‌ జగన్‌కు మద్దతు పలికారని చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ రాయలసీమకు తెలంగాణ జలాలు సమర్పించారన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కృష్ణా జలాలపై ప్రభుత్వ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొని 2016లో చంద్రబాబు సమక్షంలో కేసీఆర్‌ సంతకాలు చేశారని, దీనికి ఆయన వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టులో కేసు అప్పట్లోనే వాపస్‌ తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. జగన్‌కు లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. 811 టీఎంసీల పంపకం మీదే ప్రభుత్వం పట్టుబట్టాలని, కేటాయింపులు లేని ప్రాజెక్టుల గురించి మాట్లాడి, ఇతర రాష్ట్రాలకు ఆయుధం ఇవ్వొద్దని బీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి సూచించారు. తనకు అడ్డు తగిలిన రాజగోపాల్‌రెడ్డిని కడియం తిప్పికొడుతూ, ‘‘నువ్వు హోంమంత్రి అయ్యేది లేదు.. చచ్చేది లేదు’’ అన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 04:30 AM