Share News

అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:41 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని, దేశ ప్రజలకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

అమిత్‌షాను  బర్తరఫ్‌ చేయాలి

పలువురు కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్‌

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి, బైఠాయింపు

హైదరాబాద్‌ సిటీ/ కవాడిగూడ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని, దేశ ప్రజలకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ను అవమాన పరిచేవిధంగా అమిత్‌షా మాట్లాడడంపై ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వగా.. మంగళవారం టీపీసీసీ ఆధ్వర్వాన హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే బైఠాయించిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అమిత్‌షాకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా ఏఐసీసీ జాతీయ కో-ఆర్డినేటర్‌ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితర నేతలు, కార్యకర్తలతో బయలుదేరారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడుతూ.. అమిత్‌షాతో పాటు ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీలకు అంబేడ్కర్‌పై అపారమైన ద్వేషముందని అన్నారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు తొలగిపోయిందని, మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్‌ పరివార్‌ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వీ.హనుమంతరావు మాట్లాడుతూ అంబేడ్కర్‌పై అమిత్‌ షా అహంకార పూరితంగా మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 05:41 AM