Share News

నాకు కావాల్సిందంతా కాంగ్రెస్‌ ఇచ్చింది

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:35 AM

ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో కేసీఆర్‌ను చూసి నేర్చుకున్నా. ప్రజల్లో ఉంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటా. కాంగ్రెస్‌ పార్టీ నాకు కావాల్సిందంతా ఇచ్చింది.

నాకు కావాల్సిందంతా  కాంగ్రెస్‌ ఇచ్చింది

ఇక పార్టీ రుణం తీర్చుకుంటా.. గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి

ఫిబ్రవరిలోపు 22 వేలు, డిసెంబరులోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం..

నామినేటెడ్‌ పదవులన్నీ వెంటనే భర్తీ చేస్తాం’’

ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో కేసీఆర్‌ను చూసి నేర్చుకున్నా. ప్రజల్లో ఉంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటా. కాంగ్రెస్‌ పార్టీ నాకు కావాల్సిందంతా ఇచ్చింది. ఇక నేను పార్టీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ మాడల్‌ అని కాంగ్రెస్‌ రేపు జరగబోయే ఎన్నికల్లో గర్వంగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా.రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ ఇలాగే ఉంటారా.. మార్పు వస్తుందా?

ఎలాంటి మార్పు ఉండదు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో కేసీఆర్‌ను చూసి నేర్చుకున్నా. ప్రజల్లో ఉంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటా. కాంగ్రెస్‌ పార్టీ నాకు కావాల్సిందంతా ఇచ్చింది. ఇక నేను పార్టీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ మోడల్‌ అని కాంగ్రెస్‌ రేపు జరగబోయే ఎన్నికల్లో గర్వంగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. అధికారంలో లేకపోయినా 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. అయినా నన్ను వీడకుండా అనేకమంది నేతలు నాతో ఉంటున్నారంటే నా మాటంటే గౌరవం. ఇచ్చిన మాట తప్పనన్న నమ్మకం. ముఖ్యమంత్రిగా కూడా నా మాటకు కట్టుబడి ఉంటా. ఎన్నికల్లో గెలిచాక మీవద్దకు వస్తానన్నా.. వచ్చాను. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేసి మీవద్దకు మళ్లీ వస్తా. వంద రోజుల మా పాలనను పోస్ట్‌మార్టం చేయండి.

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?

ఇప్పటికే వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం. టీఎ్‌సపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులను రాజీనామా చేయాలని వ్యక్తిగతంగా కోరాను. వారి రాజీనామాలను గవర్నర్‌ రాష్ట్రపతికి పంపారు. అయితే తొలగింపునకు గల కారణాలపై రాష్ట్రపతి కొన్ని విషయాలపై స్పష్టత అడిగారు. ఆ ఫైల్‌ మళ్లీ గవర్నర్‌ నుంచి మాకు వచ్చింది. వివరాలన్నీ మళ్లీ పంపిస్తున్నాం. అయితే టీఎ్‌సపీఎస్సీకి చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. ఐదు పదవులు ఖాళీ ఉన్నందున వాటిని ముందుగా భర్తీ చేస్తాం. చైర్మన్‌ లేకుండా కొత్త నోటిఫికేషన్లు, నియామకాలు చేపట్టలేం. రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించినవెంటనే కొత్త చైర్మన్‌ను నియమించి నియామకాలు ప్రారంభిస్తాం. వచ్చే నెలాఖరులోగా 22 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఈ ఏడాది డిసెంబరులోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని ముందే చెప్పాం. చేసి చూపిస్తాం. అయితే ఖాళీగా ఉన్నందున బావ బామ్మర్దులు (కేటీఆర్‌, హరీ్‌షరావు) ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారివి బుర్రలేని మాటలు.. 420 అనడమేంటి..? పదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా..?

పార్టీపై ఫీల్‌ గుడ్‌ లేనందున హైదరాబాద్‌లో మీకు సీట్లు రాలేదు.. ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?

పని, ప్రవర్తన, సుపరిపాలనతో ఇక్కడి ఓటర్ల మనసు గెలుస్తాం. దీంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు వస్తే ప్రాతినిథ్యం పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుంది. అందులోనూ ఇక్కడి నేతలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

సీఎం: మైనార్టీకి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇవ్వాలంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి. దానికి గవర్నర్‌ నుంచి అనుమతి కావాలి. రాజకీయ నేపథ్యం ఉంటే ఆమోదించనని గవర్నర్‌ అంటున్నారు. అవన్నీ పరిశీలిస్తున్నాం. రెండు మూడు రోజుల కిందటే ప్రక్రియ మొదలుపెట్టాం. ఇది కూడా 100 రోజుల్లోపు పూర్తవుతుంది. నామినేటెడ్‌ పదవులన్నీ వెంటనే భర్తీ చేస్తాం. ఎన్నికల సమయంలో పార్టీ మాట ఇచ్చిన వారందరికీ న్యాయం చేస్తాం.

ప్రొఫెసర్‌ కోదండరాంకు ఎమ్మెల్సీ ఉంటుందా?

తప్పకుండా ఉంటుంది. ఆయన పార్టీకి రెండు ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని ముందే చెప్పాం. గవర్నర్‌ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తాం. ఆయన లాంటి మేధావి చట్టసభల్లో ఉండాలి. తెలంగాణ సమాజం కూడా ఆయన్ను కోరుకుంటోంది. గతంలో చుక్కా రామయ్య లాంటి మేధావులను చూశాను. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా. కానీ అక్కడ నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇరానీ కేఫ్‌లో కూర్చుని రియల్‌ ఎస్టేట్‌ గురించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అక్కడంతా దొరగారి (కేసీఆర్‌) మార్కు కనిపిస్తోంది. శాసనమండలిలో వివిధ రంగాల మేధావులను తెచ్చి మళ్లీ పూర్వ వైభవం తేవాలన్నది నా కోరిక.

ఫార్మాసిటీపై తప్పుడు సందేశం వెళ్లింది..

నా మాటలను కొందరు తప్పుగా ఊహించుకున్నారు. ఫార్మాసిటీ కాదు ఫార్మా విలేజీలు అని చెప్పాను. ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు ఈరోజు ఫార్మా, బల్క్‌డ్రగ్‌ కంపెనీల యాజమానులతో దాదాపు మూడుగంటల పాటు సమావేశం నిర్వహించా. అనుమానాలన్నీ తీర్చా. అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా కలవవచ్చని చెప్పాను.

Updated Date - Jan 07 , 2024 | 03:35 AM