రేపే కాంగ్రెస్ తొలి జాబితా!
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:38 AM
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లకు గాను ..

గురువారం ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
9 మందిని ప్రకటించే చాన్స్.. ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్‌ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన స్ర్కీనింగ్ కమిటీ.. పదికి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యాల వారీగా గుర్తించింది. ఢిల్లీలో గురువారం సమావేశం కానున్న ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ.. తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి.. అదే రోజు ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌లో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డే తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఇక, మల్కాజ్‌గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్‌రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ సీటుకు మాజీ మంత్రి జానారెడ్డి లేదా.. ఆయన తనయుడు రఘవీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ సీటును ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మెదక్‌లో ముదిరాజ్ నేత నీలం మధు, జహీరాబాద్‌లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ సీటును వదులుకున్న ప్రవీణ్‌రెడ్డితోపాటు వెలమ సామాజిక వర్గ నేత రాజేందర్‌రావు పేర్లను కరీంనగర్ సీటు కోసం పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ నేత మస్కతితోపాటు మరో మహిళ పేరు వినిపిస్తోంది. ఇక, వరంగల్ సీటుకు దొమ్మాట సాంబయ్య పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ సీటు తనదేనని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియా ముఖంగానే చెబుతున్నారు. కానీ, ఆ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ సైతం పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీతోపాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ సుగుణ కుమారి పేరునూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేత పెర్క శ్యామ్ పేరు సైతం వినిపిస్తోంది. మహబూబాబాద్ సీటుకు బలరాం నాయక్, పార్టీ నేత విజయాభాయి అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సోయం బాపూరావుకు ఆ పార్టీ తొలి జాబితాలో సీటు దక్కని సంగతి తెలిసిందే. పూర్వాశ్రమంలో కాంగ్రెస్, టీడీపీల్లో పని చేసిన ఆయనను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంఽధీని సీఎం రేవంత్‌రెడ్డి కోరిన నేపథ్యంలో ఆ రెండు సీట్లకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు.. ఖమ్మం సీటు కోసం ఉపముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి రేసులో ఉన్నారు. అలాగే భువనగిరి సీటును టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశిస్తుండగా, తన భార్య అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్‌ను త్యాగం చేసిన పటేల్ రమే్‌షరెడ్డితోపాటు బీసీ కోటా కింద చనగాని దయాకర్‌గౌడ్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.