Share News

నేడు కాంగ్రెస్‌ సీఈసీ భేటీ

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:07 AM

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం భేటీ కానుంది. ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీ

నేడు కాంగ్రెస్‌ సీఈసీ భేటీ

తెలంగాణలో మిగిలిన సీట్లలో అభ్యర్థులపై స్పష్టత!

హాజరుకానున్న సీఎం రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం భేటీ కానుంది. ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీ పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. తొలి జాబితాలో నలుగురు, మలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఒకట్రెండు మినహా అన్నిటికీ మిగిలిన అభ్యర్థుల పేర్లను బుధవారం సీఈసీ భేటీలో తేల్చేసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో వెల్లడించనుందని తెలుస్తోంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ విషయంలో ఇబ్బంది లేకున్నా.., భువనగిరి, ఖమ్మంలో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా తయారైంది. మరోవైపు సామాజిక సమతుల్యత పాటించడమూ సవాల్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ ఆరు సీట్లను బీసీలకు ఇవ్వగా, కాంగ్రెస్‌ ఇప్పటివరకు ప్రకటించినవాటిలో రెండు మాత్రమే కేటాయించింది. దీంతో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఇచ్చినందున ఆయన సోదరుడు భట్టి భార్య నందినికి ఖమ్మం సీటు దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడినుంచి మంత్రి పొంగులేటి తమ్ముడిని నిలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు గాను పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లో మాల వర్గం నాయకులకు టికెట్లిచ్చారు. వరంగల్‌ను మాదిగ వర్గానికి కేటాయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సీటును దొమ్మేటి సాంబయ్యతో పాటు డాక్టర్‌ రామగల్ల పరమేశ్వర్‌ ఆశిస్తున్నారు. పరమేశ్వర్‌ గతంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి పోటీ చేశారు. ఏఐసీసీ పరిశీలనలో ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి రేవంత్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరిన ఆత్రం సుగుణకు ఆదిలాబాద్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. నిజామాబాద్‌కు జీవన్‌రెడ్డి, మెదక్‌కు నీలం మధు, కరీంనగర్‌కు ప్రవీణ్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశమయ్యారు.

Updated Date - Mar 27 , 2024 | 05:22 AM