Share News

కాంగ్రెస్‌ వచ్చింది.. కరువును తెచ్చింది

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:33 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి, కరువును తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశమ య్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో

కాంగ్రెస్‌ వచ్చింది.. కరువును తెచ్చింది

నీళ్లు, విద్యుత్తు కష్టాలు మొదలయ్యాయి

ఉద్దెర మాటలతో అధికారంలోకి వచ్చింది: హరీశ్‌

సిద్దిపేట టౌన్‌/చిన్నకోడూరు/హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి, కరువును తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశమ య్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించారు. అలాగే సిద్దిపేటలో రూ.5 లక్షలతో నిర్మించే ఏకలవ్య మిత్ర మండలి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో గౌడ సంఘం కమ్యూనిటీ హల్‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమా ల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలని, ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ఉద్దెర హామీలిచ్చిందని, రైతు బంధు, రైతు రుణమాఫీ, వరి పంటకు బోనస్‌ ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్య లక్ష్మి కింద రూ. 10 లక్షల పథకం అమలు చేస్తే, రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా రూ. 10 లక్షలు ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500 ఇస్తామన్న మాట ఏమైందని, వృద్ధులకు డిసెంబరు నెల నుంచి రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని, నాలుగు నెలలైనా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఎండాకాలం కరువులోనూ పంట పండుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు, మాజీ సీఎం కేసీఆర్‌ కృషి వల్లేనని ఆయన పేర్కొన్నారు.

పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించండి

రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు నెలలతరబడి జీతాలు అందడంలేదని, వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వ హణ, ఇతర ముఖ్యమైన విధులు నిర్వహిస్తున్న 60వేల మందికి పైగా ఉద్యోగ, కార్మికులకు వేతనాలు రాకపోవడం ఇబ్బందిగా మారిందని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 04:33 AM