కమిటీలు ఖరారు!
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:56 PM
వికారాబాద్ జిల్లాలో 684 ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. నాలుగు మునిసిపాలిటీల్లో 99వార్డులు, 585 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీల్లో 566 ఇంతకు ముందున్న గ్రామ పంచాయతీలు కాగా, కొత్తగా మరో 19 గ్రామ పంచాయతీలు ఏర్పాటైన విషయం తెలిసిందే. మునిసిపాలిటీల్లో ఒక్కో వార్డుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామ పంచాయతీ పరిఽధిలో ఒక ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు కానున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో, ఏర్పాటైన ఇందిరమ్మ కమిటీల్లో ఏడుగురికి సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారు.
త్వరలో ప్రభుత్వం వద్దకు ఇందిరమ్మకమిటీల జాబితా
చివరి దశకు చేరిన ఎంపిక ప్రక్రియ
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు
జిల్లాలో 684 ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందిరమ్మ కమిటీల నియామక ప్రక్రియను ఈనెల 12వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉండగా, కొన్ని మునిసిపల్ వార్డులు, పంచాయతీల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో జాప్యం చోటు చేసుకుంది. త్వరగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
వికారాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిరుపేదల స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. .ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అర్హులను ఎంపిక చేసే బాధ్యత ఇందిరమ్మ కమిటీలదే. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిఽధిలో నియామకమయ్యే ఇందిరమ్మ కమిటీలు సామాజిక బాధ్యతతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. త్వరగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీలక భూమిక పోషించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఇందిరమ్మ కమిటీలు తెరపైకి వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు, ఎస్సీ,. ఎస్టీలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం మూడు విడతల్లో అందజేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత డిసెంబరు నెలలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం పేరిట ప్రజల నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందడానికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 2,64,242 దరఖాస్తులు వచ్చాయి.
684 కమిటీల నియామకం?
వికారాబాద్ జిల్లాలో 684 ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. నాలుగు మునిసిపాలిటీల్లో 99వార్డులు, 585 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీల్లో 566 ఇంతకు ముందున్న గ్రామ పంచాయతీలు కాగా, కొత్తగా మరో 19 గ్రామ పంచాయతీలు ఏర్పాటైన విషయం తెలిసిందే. మునిసిపాలిటీల్లో ఒక్కో వార్డుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామ పంచాయతీ పరిఽధిలో ఒక ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు కానున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో, ఏర్పాటైన ఇందిరమ్మ కమిటీల్లో ఏడుగురికి సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారు.
గ్రామాలు, మున్సిపాలిటీల్లో..్ల
గ్రామ పంచాయతీల పరిధిలో ఇందిరమ్మ కమిటీలకు సర్పంచ్ లేదా ప్రత్యేకాధికారి చైర్మన్‌గా కొనసాగనున్నారు. పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా కొనసాగుతారు. గ్రామంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు సభ్యులుగా ఉండనున్నారు. అంతే కాకుండా ఈ కమిటీలో ముగ్గురు స్థానికులను సభ్యులుగా తీసుకోనుండగా, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికీ అవకాశం కల్పించనున్నారు. అదే మునిసిపాలిటీల్లోనైతే వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుకు చర్యలు చేపట్టగా ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వార్డుల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ప్రక్రియను మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. మునిసిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు ఇందిరమ్మ కమిటీకి చైర్మన్/చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా, వార్డు అధికారి కమిటీకి కన్వీనర్‌గా కొనసాగనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, స్థానికుల కోటాలో మరో ముగ్గురికి సభ్యులుగా అవకాశం కల్పించనున్నారు. స్థానికుల కోటాలో నియామకమయ్యే వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో నుంచి ఒక్కొక్కరికీ కమిటీలో చోటు కల్పించనున్నారు. మునిసిపాలిటీల పరిధిలో కమిషనర్లు, మండలాల పరిధిలో ఎంపీడీవోలు ఇందిరమ్మ కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి తుది నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు.
చివరి దశకు కమిటీల ఏర్పాటు ప్రక్రియ
ఇందిరమ్మ కమిటీల ఎంపిక ప్రక్రియ జిల్లాలో చివరి దశకు చేరుకుంది. నాలుగు మునిసిపాలిటీల్లోని వార్డులతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో అక్కడక్కడ ఒత్తిడి నెలకొన్న వార్డులు, పంచాయతీల్లో మాత్రం విబేధాలకు చోటు కల్పించకుండా చర్చించి కమిటీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో విద్యావంతులు, సామాజిక కార్యకర్తలకు అవకాశం కల్పించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.