రాష్ట్రాల కోరికలన్నీ తీర్చలేం
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:00 AM
జాతీయ ప్రయోజనాలను ప్రామాణికంగా చేసుకొని గోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి రాష్ట్రాలు ముందుకు రావాలని, ఈ క్రమంలో రాష్ట్రాల కోరికలన్నీ తీర్చలేమని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి
నాలుగేళ్లుగా అవే వాదనలను వింటున్నాం.. ఇది అంతులేని కథగా మారుతోంది
జాతీయ ప్రయోజనాల రీత్యా.. ముందుకు రాకుంటే ప్రాజెక్టును పక్కనపెడతాం
ఇంట్రా-లింక్‌లతో ముందుకొస్తే అనుమతులు
గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలి: ఏపీ
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రయోజనాలను ప్రామాణికంగా చేసుకొని గోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి రాష్ట్రాలు ముందుకు రావాలని, ఈ క్రమంలో రాష్ట్రాల కోరికలన్నీ తీర్చలేమని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పష్టంచేశారు. మంగళవారం నదుల అనుసంధానంపై న్యూఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, అంతరాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్(సీఈ) ఓరుగంటి మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం ప్రసాద్.. ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ ఇంజనీర్(సీఈ-హైడ్రాలజీ) రత్నకుమార్, పలు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేబశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ.. గోదావరి-కావేరీ అనుసంధానంతో 148 టీఎంసీల జలాలను మాత్రమే తరలిస్తామని.. రాష్ట్రాలు కోరుకుంటున్నట్లు నీళ్లిస్తే.. జలాలు మిగలవని పేర్కొన్నారు. ‘‘గోదావరి-కావేరీలో ఇచ్చిన వాటాతో సంతృప్తి చెంది, ముందుకు వ చ్చి, ప్రాజెక్టుకు సమ్మతి తెలపండి. నాలుగేళ్లుగా అవే వాదనలను వింటున్నాం. ఈ ప్రాజెక్టు వ్యవహారం అంతులేని కథలాగా మారింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ప్రాజెక్టులో ముందుకు పోలేం. రాష్ట్రాలు ముందుకు రాకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టాల్సి ఉంటుంది. అయితే.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలతో ఈ నెలాఖరులోపు ప్రత్యక్ష విధానంలో సమావేశం ఏర్పాటు చేసి, ఏకాభిప్రాయం సాధించాలని ఎన్‌డబ్ల్యూడీఏను ఆదేశించారు. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ సమావేశంలో, అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక రాష్ట్రాల భూభాగంలో లోపల ఏమైనా లింకులుంటే.. ఎన్‌డబ్ల్యూడీఏ నుంచి సహకారం అందిస్తామని, కేంద్ర జలశక్తి అనుమతులు ఇప్పిస్తామని వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు మాట్లాడుతూ గోదావరి-కావేరీలో కేవలం తాగునీటికే కేటాయింపులు చేశారని, రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలున్నాయని, సాగునీటిని కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా చేపట్టిన బెడ్తి-వార్దా లింక్‌ను బయటకి తేవాలని, రాష్ట్రం లోపల చేపట్టే ప్రాజెక్టుగానే దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు మాత్రం గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశామని, రాష్ట్రాల సమ్మతి తీసుకొని, సత్వరం ప్రాజెక్టును చేపట్టాలని కోరాయి.
పోలవరం నుంచి ప్రాజెక్టును చేపట్టాలి: ఏపీ
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుంచి చేపట్టాలని ఏపీ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ ఈ సందర్భంగా ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. ప్రస్తుత ప్రాజెక్టు డీపీఆర్ 14 ఏళ్ల క్రితం సిద్ధం చేసిందని, ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా తమ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానంపై అధ్యయనం కూడా పూర్తయిందని, పోలవరం-కృష్ణా-పెన్నార్-కావేరీ లింక్ పేరిట దీన్నిచేపట్టాలని కోరింది. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. పోలవరం నుంచి గోదావరి-కావేరీ లింక్‌ను చేపట్టే ప్రసక్తే లేదని, నదుల అనుసంధానం అనేది అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగే ప్రాజెక్టు అని, రెండు రాష్ట్రాల మధ్య(తమిళనాడు-ఏపీ) దీన్ని చేపట్టలేమని, అవసరమైతే రాష్ట్రం లోపల ఇంట్రా(రెండు బేసిన్‌ల మధ్య) చేపడితే సహకారం అందిస్తామని స్పష్టంచేశారు.
గోదావరి-కావేరీలో 50% వాటా ఇవ్వాలి: తెలంగాణ
గోదావరి-కావేరీ అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీలను తమకు కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రాన్ని కోరారు. దీనిపై అక్టోబరులో లేఖ రాశామని ఆయన చెప్పగా.. తమకు చేరలేదని ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు బదులిచ్చారు. దాంతో ఆ లేఖలోని అంశాలను వివరిస్తూ.. తమ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గోదావరి-కావేరీ అనుసంధానంలో వాటాగా వచ్చే నీటిని సమ్మక్క బ్యారేజీ పరిసరాల్లో కాకుండా లోయలు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కల ఎగువన రెండు రిజర్వాయర్‌లను నిర్మించాలని, అక్కడి నుంచి నీటిని వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ విచారణ చేపడుతున్నందున, నీటి వాటాలు తేలిన తర్వాతే నాగార్జునసాగర్ రిజర్వాయర్‌ను గోదావరి-కావేరీ లింక్‌లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. 83 మీటర్ల ఎత్తుతో ఉన్న సమ్మక్క బ్యారేజీలో 83-87 మీటర్ల మధ్యలో నీటిని నిల్వ చేసి, ఆ మధ్యలో ఉన్న నీటిని మాత్రమే గోదావరి-కావే రీ అనుసంధానంలో తరలించాలని, 83 మీటర్ల కింద నిల్వ ఉన్న నీటిని ముట్టుకోరాదని, అక్కడ సీతమ్మ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలుపుకొని, 158 టీఎంసీల అవసరం ఉంటుందని.. ఈ వినియోగానికి రక్షణ కల్పించాలని కోరారు.
‘దామన్‌గంగా-వైతర్ణ-గోదావరి’కి సహకరించండి: మహారాష్ట్ర
కొత్తగా దామన్‌గంగా-వైతర్ణ-గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, దీన్ని గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగం చేయాలని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి కేంద్రాన్ని కోరారు. దామన్‌గంగా-వైతర్ణలను తీసుకొచ్చి, గోదావరిలో కలపడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతి కోరుతూ డీపీఆర్‌ను సమర్పించామని, దీనికి అనుమతి ఇప్పించాలని కోరారు.