Share News

సచివాలయం 9వ ఫ్లోర్‌లోకి సీఎం కార్యాలయం!?

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:55 AM

ప్రస్తుతం సచివాలయంలోని ఆరో అంతస్తులో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలో 9వ అంతస్తులోకి మారనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

సచివాలయం 9వ ఫ్లోర్‌లోకి సీఎం కార్యాలయం!?

పరిశీలించిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు

రేవంత్‌ లక్కీ నెంబర్‌ 9 అని ప్రచారం

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం సచివాలయంలోని ఆరో అంతస్తులో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలో 9వ అంతస్తులోకి మారనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ మేరకు అందుకు అవసరమైన చర్యలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తన కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తుకు మార్చుకోనున్నారని, అందుకే ఆయా ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అవసరమైన పనులను చేపట్టేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఆ ఫ్లోర్‌ను పరిశీలించినట్టు సమాచారం. ఇంటీరియర్‌, ఫర్నిచర్‌, సాంకేతిక ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇంటీరియర్‌, ఫర్నిచర్‌ కోసం పలువురు నిపుణులు తొమ్మిదో అంతస్తును ఇప్పటికే పరిశీలించారని సమాచారం. వాస్తవానికి రాష్ట్ర సచివాలయాన్ని మొత్తం 11 అంతస్తుల్లో నిర్మించారు. అందులో 6 అంతస్తుల వరకు మాత్రమే బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ.. డోమ్‌ల కింద కూడా కొన్ని ఫ్లోర్‌లు ఉన్నాయి. అయితే గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరో అంతస్తును మాత్రమే తన కార్యాలయంగా వినియోగించేవారు. కేసీఆర్‌ 6 అంకెను తన అదృష్ట సంఖ్యగా విశ్వసించేవారు. అందులో భాగంగానే సచివాలయాన్ని కూడా ఆరు అంతస్తుల్లోనే కనిపించే విధంగా నిర్మించారని, అనంతరం తన కార్యాలయాన్ని కూడా 6వ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్‌ 9 అంకెను అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారనే ప్రచారం ఉంది. ఆయన వినియోగించే కార్ల నెంబర్లు కూడా 9 అంకెతోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ సచివాలయంలో తన కార్యాలయాన్ని 9వ ఫ్లోర్‌కి మార్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నిర్దేశించుకున్న సమయంలోపు పనులన్నీ పూర్తయితే సంక్రాంతి తరువాత సీఎం కార్యాలయం మారనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 07 , 2024 | 03:55 AM