Share News

పదేళ్లలో దేశానికి ఏం చేశారు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:47 AM

దక్షిణాది రాష్ట్రాల్లోని 130 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి అతికష్టమ్మీద 12-15 స్థానాలు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పదేళ్ల

పదేళ్లలో దేశానికి  ఏం చేశారు

బీజేపీకి ఎందుకు ఓటేయాలి

400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే..

దక్షిణాదిలోని 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 దాటవు

కేసీఆర్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెప్పారు..

కేరళలో మీడియాతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల్లోని 130 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి అతికష్టమ్మీద 12-15 స్థానాలు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టిందని ప్రజలు ఆ పార్టీకి ఓటు వేస్తారని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని, నిరుద్యోగం గరిష్ఠ స్థాయుకి చేరిందని, రైతుల సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. ముఖ్యంగా గత పదేళ్లలో ప్రధాని మోదీ.. దేశాన్ని రూ.130 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. దేశానికి సంబంధించి ఇవి అత్యంత కీలకమైన అంశాలని, ప్రజలు వీటిని పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. కేరళలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రేవంత్‌రెడ్డి గురువారం అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే 400 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీర్‌ సైతం ఇలాంటి ప్రచారమే చేశారని, మూడోసారి 100కు పైగా స్థానాలను గెలుస్తామని చెప్పుకొన్నారని, కానీ.. అతి కష్టమ్మీద 39 స్థానాల్లోనే గెలవగలిగారని గుర్తుచేశారు. ప్రధాని మోదీని గతంలో పొగిడారన్న ప్రశ్నకు రేవంత్‌ స్పందిస్తూ.. ఒక ముఖ్యమంత్రిగా దేశ ప్రధానితో మాట్లాడానే తప్ప.. పొగడలేదని అన్నారు. ప్రధానికి సంబంధించి తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. కేరళలోని మొత్తం 20 ఎంపీ స్థానాలను ఇండియా కూటమి గెలుచుకోబోతోందని, బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

పాఠశాలను ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు

మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో మదర్‌ థెరీసా హైస్కూల్‌పై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 16న శ్రీరామనవమి సందర్భంగా కొందరు స్థానికులు పాఠశాల కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, పాఠశాల ఆవరణలోని మదర్‌ థెరీసా విగ్రహంపై రాళ్లు రువ్వారు. దీనిపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పాఠశాలను కేరళలోని ఎర్నాకులం చర్చి నిర్వహిస్తోంది. పాఠశాలపై దాడి అంశాన్ని కేరళ శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్‌ రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయంలో పాఠశాల యాజమాన్యంపైనా కేసు నమోదైంది. పాఠశాలకు కాషాయ వస్ర్తాలు ధరించి వచ్చినందుకు యాజమాన్యం అభ్యంతరం తెలపడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమ తల్లిదండ్రులను తీసుకురావాలని చదువులో వెనకబడ్డ విద్యార్థులను తాము కోరగా.. వారు మరుసటి రోజు హనుమాన్‌ దీక్ష తీసుకుని, కాషాయ వస్ర్తాలు ధరించి వచ్చారని ప్రిన్సిపాల్‌ చెప్పారు. కాషాయ వస్ర్తాలు ధరించారంటూ తామెవరినీ అడ్డుకోలేదని, క్రైస్తవ పాఠశాల కావడంతో కొన్ని హిందూ సంస్థలు ఉద్దేశపూర్వకంగా దాడి చేశాయుని తెలిపారు. కాగా, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశమని ఈ పాఠశాలను నిర్వహిస్తున్న ఎర్నాకుళం చర్చి గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Apr 19 , 2024 | 04:47 AM