Share News

CM Revanth Reddy : అదనపు రుణం ఇప్పించండి

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:07 AM

రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, అదనపు అప్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గళమెత్తింది.

CM Revanth Reddy : అదనపు రుణం ఇప్పించండి

కేంద్రం, రాష్ట్రానికి మధ్యవర్తిత్వం నెరపండి

నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విన్నపం

ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి

వెనుకబడిన జిల్లాల గ్రాంటు 1,800 కోట్లు ఇప్పించండి

16వ ఆర్థిక సంఘం ద్వారా ఎక్కువ నిధులు ఇవ్వాలని వినతి

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, అదనపు అప్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గళమెత్తింది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని, దీని నుంచి బయట పడాలంటే రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోక తప్పదని పునరుద్ఘాటించింది. అందుకుగాను ‘నీతి ఆయోగ్‌’ మధ్యవర్తిత్వం నెరపాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను ఇప్పించాలని, అదనపు అప్పు కోసం కేంద్రాన్ని ఒప్పించాలని కోరింది. 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చేలా చూడాలని విన్నవించింది. నీతి ఆయోగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొంటుందని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని భరోసా ఇచ్చింది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌కుమార్‌ బేరి, సభ్యుడు విజయ్‌కుమార్‌ సారస్వత్‌, డీఎంఈవో డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌, డైరెక్టర్‌ అవినాష్‌ దాస్‌, మరో ఐఏఎస్‌ అధికారి ముత్తుకుమార్‌ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన విధాన రూపకల్పన, సహకారాత్మక వ్యూహాలు, ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ పలు అంశాలను నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులన్నింటినీ వాడేసిందని తెలిపారు. పర్యవసానంగా కొత్తగా ఏర్పాటైన తమ ప్రభుత్వం కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలన్నా.. నిధుల సమస్య తలెత్తుతోందన్నారు. ఈ దృష్ట్యా కేంద్రం నుంచి న్యాయబద్ధంగా, విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను విడుదల చేయించాలని కోరారు.

కేంద్ర గ్రాంట్లు ఇప్పించండి..

వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు కింద నాలుగేళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రూ.1800 కోట్లు రావాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌కు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 94(2) కింద కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమ అమలుకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2019-20 నుంచి ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున నాలుగేళ్ల నిధులు రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయించాలని కోరారు. దీంతోపాటు రాష్ట్రానికి 14వ, 15వ ఆర్థిక సంఘాలు సిఫారసు చేసిన నిధులు కూడా రావాల్సి ఉందని, వీటి విడుదలకు కేంద్రంతో మధ్యవర్తిత్వం చేయాలని విన్నవించారు. 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న 16వ ఆర్థిక సంఘం ద్వారా కూడా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు బలపడాలంటే 16వ ఆర్థిక సంఘం నిధులు ఊతమివ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించి 13 వేల కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి కేంద్రాన్ని అనుమతి కోరామని, ఈ విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో పొందుపరిచిన అప్పుల లక్ష్యం దాదాపు పూర్తయిందని, అదనపు అప్పే శరణ్యమని తెలిపారు. రాష్ట్ర విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపు ఉండాలన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్తును మరింత వినియోగించుకోవడానికి కేంద్రం సహకారం అందించాలని, సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్రం ఇచ్చే రాయితీలు, సబ్సిడీలను రాష్ట్రానికి వర్తింపజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌ను కాలుష్య రహిత ‘అర్బన్‌ గ్రోత్‌ హబ్‌’గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సూచించాలని నీతి ఆయోగ్‌కు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

సహకారాత్మక సమాఖ్య విధానం అవసరం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసరించాల్సిన సహకారాత్మక సమాఖ్య విధానంపై సమావేశంలో చర్చించారు. ప్రభావవంతమైన పాలనకు సహకారాత్మక సమాఖ్య విధానం ఒక మార్గదర్శక సూత్రమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి నీతి ఆయోగ్‌, రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలు, కీలక రంగాల అభివృద్ధి, ఇందుకు అనుసరించాల్సిన మార్గాలను సీఎం వివరించగా.. నీతి ఆయోగ్‌ సభ్యులు సావధానంగా విన్నారు. వినూత్న పాలనా పద్ధతులు, విజయవంతమైన నమూనాలను పరస్పరం అందిపుచ్చుకోవడానికి సహకరించుకోవాలని నిర్ణయించారు. స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడంలో మెరుగైన పద్ధతులను అవలంబించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. కాగా, రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేస్తున్న యువతలో నైపుణ్యాన్ని పెంపొందించాలన్న చర్చ కూడా ఈ సందర్భంగా జరిగింది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్సె్‌సపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర సౌజన్య పథకమైన(సీఎ్‌సఎస్‌) ‘స్టేట్‌ సపోర్ట్‌ మిషన్‌’ కింద స్టేట్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ఏర్పాటు చేయడంపై చర్చించారు.

పీపీపీ పద్ధతిలో మూసీ పరివాహక అభివృద్ధి

అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే మూడేళ్లలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. తొలుత హైదరాబాద్‌ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలు చార్మినార్‌, తారామతి బరాదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్‌ డిజైన్‌ను రూపొందించాలన్నారు. హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఎంఆర్‌డీసీఎల్‌ అధికారులతో మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, వాటర్‌ ఫాల్స్‌, చిల్డ్రన్‌ వాటర్‌ స్పోర్ట్స్‌, స్ర్టీట్‌ వెండర్స్‌, బిజినెస్‌ ఏరియా, షాపింగ్‌ మాల్స్‌.. ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్‌ ఉండాలన్నారు.

సీఎం సార్‌.. బిజీబిజీ

సీఎం రేవంత్‌ మంగళవారం తీరిక లేకుండా గడిపారు. సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా తనను కలిసేందుకు వచ్చిన వారిని కలుస్తూ బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నానికి సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టితో కలిసి తొలుత నీతి అయోగ్‌ బృందంతో భేటీ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌ మెట్రోరైల్‌ పొడిగింపు సహా తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం తన కోసం సచివాలయానికి వచ్చిన వివిధ వర్గాల నేతలు, ప్రతినిధులతో ముచ్చటించారు. ఆ తర్వాత మూసీ నది అభివృద్ధి అంశంపై నానక్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మూసీ రివర్‌ ఫ్రంట్‌కు సహకరించండి..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నీతి ఆయోగ్‌ను కోరారు. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌, నమామీ గంగే వంటి జాతీయ, అంతర్జాతీయ పీపీపీ మోడల్స్‌ను వర్తింపజేయాలన్నారు. మూసీనది కోసం సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎస్‌టీపీ) ఏర్పాటుకు సహకరించాలన్నారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తితో పని చేయాలని నిర్ణయించారు. కాగా, నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రాన్ని నీతి ఆయోగ్‌ కోరగా.. తప్పకుండా పాల్గొంటామని, నీతి ఆయోగ్‌కు నిర్మాణాత్మక మద్దతు, సహకారాన్ని అందిస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 03:07 AM