Share News

CM Revanth Reddy : కేసీఆర్‌.. ప్రజలు నీ ప్యాంట్‌ ఊడబెరికారు మేం అంగీనీ ఊడబెరుకుతాం

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:59 AM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్యాంట్‌ను ఇప్పటికే ప్రజలు ఊడబెరికారని, ఇక తాము అంగీ (చొక్కా) కూడా ఊడబెరుకుతామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంపుతారా అని కేసీఆర్‌ అడుగుతున్నారని, చచ్చిన పామును చంపాల్సిన అవసరం తమకు లేదని, ఇప్పటికే

CM Revanth Reddy : కేసీఆర్‌.. ప్రజలు నీ ప్యాంట్‌ ఊడబెరికారు మేం అంగీనీ ఊడబెరుకుతాం

సీఎంను ఏం పీకడానికి పోయిండ్రు అంటావా?..

సీఎం, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది?

నల్లగొండ సభలో కేసీఆర్‌ వాడిన భాష పైన చర్చిద్దామా?

వీల్‌చైర్‌లో వీధి నాటకాలు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్యాంట్‌ను ఇప్పటికే ప్రజలు ఊడబెరికారని, ఇక తాము అంగీ (చొక్కా) కూడా ఊడబెరుకుతామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంపుతారా అని కేసీఆర్‌ అడుగుతున్నారని, చచ్చిన పామును చంపాల్సిన అవసరం తమకు లేదని, ఇప్పటికే ఆ పామును ప్రజలు చేతితో కాకుండా కట్టెతో కొట్టి చంపారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని నింపడం లేదని మాట్లాడుతున్నారని, సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన కేసీఆర్‌, హరీశ్‌రావుకే పెత్తనం ఇస్తామని, వారినే నింపమనండి, ఎలా నింపుతారో అంటూ సవాల్‌ విసిరారు. కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏం పీకడానికి పోయారంటూ నల్లగొండ సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బుధవారం అసెంబ్లీలో రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ అంశంలో కొత్త ప్రభుత్వమే తప్పు చేసినట్లు, మాదే బాధ్యత అన్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని.. ‘‘సభలో పదేపదే మా భాష గురించి మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి (కేసీఆర్‌) నల్లగొండ జిల్లాలో వాడిన భాషపై చర్చిద్దామా? ఏం పీకడానికి పోయిండ్రు అని అడుగుతారా? పదేళ్లు సీఎం, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఉద్యమకారుడినని గొప్పలు చెప్పుకొని, జబ్బలు చరుచుకునే వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి.., 4 కోట్లమంది ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం పీకడానికి పోయినవ్‌ అని అడుగుతాడా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంట్‌ ఊడబెరికితే.. చెప్పుకొనే దిక్కులేక బొక్కబోర్లాపడితే మీకు బొక్కలు ఇరిగినయ్‌. అయినా మీ బుద్ధి మారలేదు’ అని ఘాటుగా స్పందించారు. సానుభూతి కోసం వీల్‌ చైర్‌ నాటకాలు, వీధి నాటకాలాడుతున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ వ్యాఖ్యానించారు. గోదావరి జలాలు, కాళేశ్వరంపై చర్చకు సిద్ధమైతే మీ పార్టీ (బీఆర్‌ఎస్‌) నాయకుడిని సభకు పిలవాలని, గురువారం సాయంత్రం వరకైనా కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పారిపోయి ప్రగల్భాలెందుకు?

కాళేశ్వరం, గోదావరి జలాల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌ స్పష్టం చేశారు. ‘‘నిజాయతీ ఉంటే, అవినీతికి పాల్పడకపోతే, మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే.. దానిమీద తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించడానికి మాజీ సీఎం కేసీఆర్‌ను సభలోకి రమ్మనండి. పారిపోయి, అక్కడెక్కడికో పోయి ప్రగల్భాలు పలకడమెందుకు? వాస్తవాలపై చర్చిద్దాం రమ్మనండి. ఆయన తప్పించుకుంటాడు. ఈయనొచ్చి (కేటీఆర్‌) కొత్త మాటలు చెబుతాడు’’ అని అన్నారు. చర్చకు సిద్ధమైతే బీఆర్‌ఎస్‌ పక్ష నేత సభకు రమ్మనాలని.. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడకపోతే చర్చకు రావాలని కోరారు. ‘‘ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏ అంశాలపై చర్చించాలనుకుంటున్నారో, అన్ని విషయాలపై శ్వేతపత్రం సందర్భంగా చర్చిద్దాం. కాళేశ్వరంపై చర్చించడానికైనా ప్రత్యేక సమయం కేటాయిస్తే, తప్పకుండా చర్చిద్దాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి తప్పించుకుని, అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని పారిపోయి, ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారని విమర్శించారు.

సభకు రాకుండా ఇలా మాట్లాడతారా?

‘‘గోదావరి జలాలు, దానిపై నిర్మించిన బ్యారేజీలు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను చూసివచ్చి చర్చించుకుందామని మీ (స్పీకర్‌) అనుమతి తీసుకున్నాం. కానీ, ప్రధాన ప్రతిపక్షం రాలేదు. పైగా, కొత్త ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే, అక్కడ నీళ్లు నింపడానికి అవకాశముందా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌, హరీశ్‌ సాగునీటి పారుదల మంత్రులుగా పనిచేశారు కదా.. వారికే పెత్తనం ఇస్తాం. మేడిగడ్డలో నీళ్లను నింపమనండి. అన్నారం, సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత తీసుకోండి. మొత్తం బ్యారేజీ కుం గిపోయి, కుప్పకూలిపోతుంటే.. నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక, ఖర్చు పెట్టిన 94వేల కోట్లు వృథా అయ్యాయి. మొత్తం ప్రాజెక్టు దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లి సమాధానం చెప్పుకోలేక, శాసనసభకు రాకుండా ముఖ్యమంత్రిని పట్టుకుని ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడొచ్చా?’’ అని నిలదీశారు.

Updated Date - Feb 15 , 2024 | 03:59 AM