Share News

Manchiryāla- ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్షాళన

ABN , Publish Date - Apr 22 , 2024 | 10:52 PM

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం పరులపాలు కాకుండా జిల్లా పౌర సరఫరాల శాఖ చర్యలు ప్రారంభించింది. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాల కు తావు లేకుండా ఉండేందుకు కేంద్రాల ప్రక్షాళనకు పూనుకుంది.

Manchiryāla-      ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్షాళన
దండేపల్లి మండలం మాకులపేటలో రైతులు, నిర్వాహకులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

- అవినీతి ఆరోపణలు మూటగట్టుకోవడమే కారణం

- పూర్తి బాధ్యతలు ఐకేపీకే అప్పగింత

మంచిర్యాల, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం పరులపాలు కాకుండా జిల్లా పౌర సరఫరాల శాఖ చర్యలు ప్రారంభించింది. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాల కు తావు లేకుండా ఉండేందుకు కేంద్రాల ప్రక్షాళనకు పూనుకుంది. గతంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వపరంగా ఐకేపీతోపాటు డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాజకీయ ప్రమేయం కార ణంగా ఈ సంవత్సరం పౌర సరఫరాల శాఖ భారీ మార్పులు చేసింది.

- 262 కొనుగోలు కేంద్రాలు..

యాసంగి సీజన్‌లో జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొను గోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 262 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో బెల్లంపల్లి, చెన్నూరు నియోజక వర్గాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ కేంద్రాలు ఉన్నాయి. పై రెండు నియోజక వర్గాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పా టుకు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఎసీఎస్‌, డీసీఎంఎస్‌ కేంద్రాలను అధికారులు అనుమతించారు. ఈ సీజన్‌లో పై మూడు రకాల కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మంచిర్యాల నియోజక వర్గంలో మాత్రం కేవలం ఐకేపీ సెంటర్ల ద్వారా మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. నియోజక వర్గంలో పీఏ సీఎస్‌, డీసీఎంఎస్‌ కేంద్రాలను అధికారులు తొలగించారు. మంచిర్యాల నియోజక వర్గానికి సంబంధించి యాసంగి సీజన్‌లో మొత్తం 77 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌లకు స్థానం కల్పించలేదు.

- రాజకీయ జోక్యంతోనే..

గతంలో ధాన్యం కొనుగోలు చేయడంలో మితిమీరిన రాజకీయ జో క్యం కారణంగానే పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ సెంటర్లను తొలగించినట్లు తెలుస్తోంది. గతంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వారిలో (ఐకేపీ మినహా) రాజకీయ నాయకులు, రైస్‌ మిల్లర్ల యజమానులు, ఫర్టిలైజర్‌ షాపుల నిర్వాహకులు ఉండేవారు. ఈ కారణంగా ధాన్యం నే రుగా రైతుల నుంచి ఆయా వర్గాల వారు నిర్వహించే కొనుగోలు కేంద్రా లకే తరలి వెళ్లేవి. అక్కడ వారు తీసుకునే నిర్ణయానికి రైతులు కట్టుబడి ఉండాల్సి వచ్చేది. పంటల సాగు సమయంలో రైతులకు అవసరమైన సాగు పెట్టుబడి, ఎరువులు, ఇతర అవసరాల కోసం ఆయా వర్గాల ప్రజలపై ఆధారపడేవారు. దీంతో పంట చేతికి వచ్చిన తరువాత ఆయా వర్గాలు నిర్వహించే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అలా ధాన్యం ఆయా కేంద్రాలకు తరలించేలా రైతులపై ఒత్తిడి పెరిగేది. దీంతో ఆయా కేంద్రాల నిర్వాహకులు తక్కువ తూకం వేయడం, మద్దతు ధర తక్కువగా చెల్లించడం జరిగేది. అలా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లేది. ఈ విధానంపై ఫిర్యాదులు అందడంతో పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాల ప్రక్షాళనకు పూనుకుంది. కాగా కొంతమంది మిల్లరు నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల లక్ష్యం తగ్గకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా రెండు రకాల సెంటర్లను తొలగించారు.

- రైతులకు ఇబ్బందులు కలుగకుండా..

పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాలు తొలగించడంతో రైతుల పై వాటి ప్రభావం పడకుండా ఉండేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రతి సీజన్‌లో ఒక్కో కొనుగోలు కేంద్రానికి కొనుగోళ్లను బట్టి రూ. 50వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తుండేవి. ప్రస్తుతం రెండు రకాల కొనుగోలు కేంద్రాలను తొలగించినందున లాభాలు రాక, ఆయా సెంటర్ల నిర్వాహకులు రైతులను, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ నిత్యం మంచిర్యాల నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సమీపంలోని ఐకేపీ సెంటర్‌లో మాత్రమే విక్రయించేలా చర్య లు చేపడుతున్నారు. తద్వారా తూకంలో అక్రమాలను నిరోధించడం, వెంట వెంటనే ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందడంతోపాటు త్వరితగతిన నగదు బ్యాంకుల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

- 85 వేల హెక్టార్లలో వరి సాగు..

ఈఏడాది యాసంగిలో జిల్లాలో 85 వేల హెక్టార్లలో వరి పంట సాగయింది. గత సీజన్‌లో జిల్లాలో 2 లక్షల 28వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్‌లో లక్షా 75వేల మెట్రిక్‌ టన్నులు వస్తుందని భావిస్తున్నారు. కాగా కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా వరికి మద్దతు ధర గ్రేడ్‌-ఏ రకం రూ. 2203 ఉండగా, కామన్‌ వెరైటీ రూ. 2183గా ఉంది.

అవినీతికి ఆస్కారం లేకుండా

- మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాం టి అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. ఇందు లో భాగంగానే ఈ సీజన్‌లో మంచిర్యాల నియోజకవర్గంలో కేవలం ఐకేపీ సెంటర్ల ద్వారానే కొనుగోళ్లు ప్రారంభించాం. ఇదివరకే జిల్లా వ్యాప్తంగా అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పించాం. రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని ఎండబెట్టుకొని, చెత్తచెదారం లేకుండా చేసి, కేంద్రానికి తీసుకు వచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Apr 22 , 2024 | 10:52 PM