Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

యూరిన్‌ టెస్ట్‌లో.. డైరెక్టర్‌ క్రిష్‌కు క్లీన్‌చిట్‌

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:18 AM

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసులో సినీ దర్శకుడు క్రిష్‌కు యూరిన్‌ టెస్ట్‌లో క్లీన్‌చిట్‌ వచ్చింది.

యూరిన్‌ టెస్ట్‌లో.. డైరెక్టర్‌ క్రిష్‌కు క్లీన్‌చిట్‌

ఇంకా అందాల్సిన రక్త పరీక్షల రిపోర్టులు

గోవా డ్రగ్స్‌ డీలర్లతో మిర్జా బేగ్‌కు లింకులు

అతని స్నాప్‌చాట్‌లో కస్టమర్ల గుట్టు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసులో సినీ దర్శకుడు క్రిష్‌కు యూరిన్‌ టెస్ట్‌లో క్లీన్‌చిట్‌ వచ్చింది. శుక్రవారం క్రిష్‌ గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే..! మాదాపూర్‌ డీసీపీ ఆయనను విచారించారు. ఆ తర్వాత క్రిష్‌కు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించాల్సిందిగా డీసీపీ ఆదేశించారు. దీంతో పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూత్రపరీక్ష, నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో రక్తపరీక్షలు నిర్వహించారు. యూరిన్‌ పరీక్షలో ‘డ్రగ్స్‌ నెగటివ్‌’గా తేలినట్లు పోలీసులు తెలిపారు. రక్తపరీక్షల నివేదిక ఇంకా రావాల్సి ఉందని వివరించారు. ఒకట్రెండు రోజుల్లో ఆ రిపోర్టులు వస్తాయని చెప్పారు. కాగా.. ఈ కేసు దర్యాప్తులో గచ్చిబౌలి పోలీసులు పురోగతిని సాధించారు. డ్రగ్స్‌ మూలాలను ప్రాథమికంగా గుర్తించారు. మిర్జా వహీద్‌ బేగ్‌ ప్రధాన డ్రగ్స్‌ సప్లయర్‌గా.. అతని నుంచి అబ్బాస్‌, వివేకానంద డ్రైవర్‌ ద్వారా రాడిసన్‌ హోటల్‌కు డ్రగ్స్‌ చేరినట్లు నిర్ధారించారు. వివేకానందకు-మిర్జాకు మధ్య అబ్బాస్‌ వారధిగా పనిచేసినట్లు తేల్చారు.

మిర్జాకు గోవాలో ఉన్న డ్రగ్స్‌ డీలర్లతో నేరుగా సంబంధాలున్నాయని, రహ్మాన్‌ అనే వ్యక్తి ద్వారా అతను గోవా నుంచి మత్తుపదార్థాలను తెప్పించేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. గోవా డీలర్లతో మిర్జా స్నాప్‌చాట్‌ ద్వారా ఆర్డరిచ్చేవాడని, నగరంలోని తన కస్టమర్లతోనూ ఈ యాప్‌ ద్వారానే సంప్రదింపులు జరిపేవాడని వెల్లడించారు. ఇతను ఎక్కడా పోలీసులకు చిక్కకుండా హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ‘‘ఒకరికి తెలియకుండా మరొకరి ద్వారా.. ఓ చైన్‌ సిస్టమ్‌ మాదిరిగా డ్రగ్స్‌ సరఫరా చేయడం మిర్జా శైలి. అతని స్నాప్‌చాట్‌ను విశ్లేషిస్తే.. నగరంలోని కస్టమర్ల వివరాలు తెలుస్తాయి. అతను వివేకానంద పార్టీలకు 10 సార్లు డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు గుర్తించాం’’ అని వివరించారు. కాగా.. మిర్జాబేగ్‌ అరెస్టు సందర్భంగా పోలీసులు అతని వద్ద 4 గ్రాముల కొకైన్‌ను సీజ్‌ చేశారు. మరోవైపు రాడిసన్‌ హోటల్‌ యాజమాన్యం, ఆపరేషన్స్‌ మేనేజర్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.

Updated Date - Mar 03 , 2024 | 04:18 AM