సీఐకి బేడీలు
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:22 AM
హైదరాబాద్ పంజాగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద గత నెల 23న కారుతో బీభత్సం సృష్టించిన కేసులో నిందితుడిని తప్పించిన మరో ఇన్‌స్పెక్టర్ అరెస్టయ్యారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే
కుమారుడి కేసులో అరెస్ట్
ఎమ్మెల్యే అనుచరుడు కూడా..
ప్రజాభవన్ వద్ద కారు
బీభత్సం కేసులో పురోగతి
నిందితుడు పారిపోయేందుకు
సహకరించిన ప్రేమ్‌కుమార్
త్వరలో మరో సీఐ కూడా అరెస్ట్?
బోధన్ రూరల్/పంజాగుట్ట, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పంజాగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద గత నెల 23న కారుతో బీభత్సం సృష్టించిన కేసులో నిందితుడిని తప్పించిన మరో ఇన్‌స్పెక్టర్ అరెస్టయ్యారు. ఈ కేసులో నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ నిందితుడు. అతను దుబాయ్‌కి పారిపోయేందుకు అప్పట్లో బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ సహకరించారు. దర్యాప్తు తొలినాళ్లలోనే ఈ విషయం తేలడంతో అధికారులు ప్రేమ్‌కుమార్‌ను సీసీఎ్‌సకు అటాచ్ చేశారు. ప్రమాదం జరగ్గానే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు, ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ ఫోన్‌లో మాట్లాడిన కాల్‌డేటాను దర్యాప్తు అధికారులు సేకరించారు. ప్రేమ్‌కుమార్ పాత్రపై పక్కా ఆధారాలు సేకరించారు. దీంతో.. ఆదివారం ఉదయం ప్రేమ్‌కుమార్‌ను, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసును తారుమారు చేసేందుకు తొలుత యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే..! ప్రేమ్‌కుమార్ అరెస్టు నేపథ్యంలో.. ఇప్పుడు దుర్గారావు కూడా కటకటాలు లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అనుమానితుల ఫోన్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ఇక దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సాహిల్‌ను భారత్‌కు రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.