Share News

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:09 AM

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి

ఉత్తర్వులు జారీ.. వనపర్తి నియోజకవర్గానికి రెండోసారి పదవి

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రె్‌సలో సీనియర్‌ నేతగా ఉన్న ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి రెండో జాబితాలో టికెట్‌ వచ్చింది. అయితే, మూడో జాబితాలో చిన్నారెడ్డి స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అవకాశం కల్పించారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి ఇస్తామని అప్పట్లోనే పార్టీ నుంచి హామీ వచ్చింది. కానీ, ఇటీవల జరిగిన శాసన మండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఆయనకు చోటు దక్కలేదు. ఇక పార్లమెంట్‌ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల తర్వాతే మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి చిన్నారెడ్డిని ఎమ్మెల్సీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. నామినేటెడ్‌ పదవుల భర్తీకి సంబంధించి అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి సహా పలు నామినేటెడ్‌ పదవుల భర్తీకి అధిష్ఠానం ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో చిన్నారెడ్డిని క్యాబినెట్‌ ర్యాంకు హోదా ఉన్న పదవిలో సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. కాగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌గా వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నియమితులై 2018 వరకు పనిచేశారు. కరీంనగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వినోద్‌ కుమార్‌ 2019 నుంచి 2023 వరకు ఆ పదవిలో ఉన్నారు. తాజాగా మరోసారి వనపర్తికి చెందిన నేతకు ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ పదవి దక్కింది.

Updated Date - Feb 25 , 2024 | 04:09 AM