Share News

గురుకుల నియామకాల్లో మార్పులు అవసరం

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:40 AM

తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి ఉద్యోగ నియామకాల్లో మార్పులు అవసరమని, రిలింక్వి్‌షమెంట్‌ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ కోరారు.

గురుకుల నియామకాల్లో మార్పులు అవసరం

ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకుపలువురు ఎంపిక

ఒక పోస్టు ఉంచుకుని మిగిలినవాటిని వదిలేస్తున్నారు

ఫలితంగా భర్తీకాని పోస్టులు

సీఎం రేవంత్‌కు ప్రవీణ్‌ కుమార్‌ లేఖ

స్పందించిన సీఎం..పరిష్కారానికి హామీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి ఉద్యోగ నియామకాల్లో మార్పులు అవసరమని, రిలింక్వి్‌షమెంట్‌ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ కోరారు. ఈమేరకు ఆయన సీఎం రేవంత్‌కు శనివారం లేఖ రాశారు. ఆ లేఖను ఎక్స్‌ వేదికగా సీఎంకు ట్యాగ్‌ చేశారు. గత ఏడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్‌, పీజీటీ, టీజీటీ వంటి ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేయడంతో అర్హతగల వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారని తెలిపారు. ఫలితాల్లో పలువురు ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని పేర్కొన్నారు. ఆ అభ్యర్థులు ఒక ఉద్యోగాన్ని ఎంచుకుని మిగిలిన వాటిని వదిలేయడం వల్ల అవి ఖాళీగా ఉండిపోతున్నాయని.. దీనివల్ల మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని లేఖలో వివరించారు. ఆయన ఈ లేఖను ఎక్స్‌లో సీఎంకు ట్యాగ్‌ చేయగా.. స్పందించిన రేవంత్‌ ఎక్స్‌ వేదికగానే సమాధానమిచ్చారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యలను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి ధన్యవాదాలు అని ట్వీట్‌ చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా యువత భవితను పునర్‌నిర్మించాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గురుకుల నియామకాలకు సంబంధించి ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ లేవనెత్తిన విషయాలను, సూచనలను నిశితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని సీఎం సమాధానం ఇచ్చారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్‌నిర్మాణానికి ఎవరు కలిసి వచ్చినా వారితో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. తమ ప్రయత్నం, తాపత్రయం అంతా తెలంగాణ ప్రజల కోసమే తప్ప గుర్తింపు కోసం కాదని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు.

Updated Date - Feb 25 , 2024 | 10:22 AM