Share News

కేటీఆర్‌.. ఇకనైనా వైఖరి మార్చుకో!

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:14 AM

ప్రజలు ఎన్నుకుంటేనే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారని.. కేసీఆర్‌ వల్ల కాలేదని ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన

కేటీఆర్‌.. ఇకనైనా వైఖరి మార్చుకో!

సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే: మల్లు రవి

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై నేడు ‘ప్రదేశ్‌ కమిటీ’ భేటీ

న్యూఢిల్లీ/జగిత్యాల టౌన్‌/హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎన్నుకుంటేనే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారని.. కేసీఆర్‌ వల్ల కాలేదని ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ప్రజారంజక పాలన అందిస్తూ ముందుకుసాగుతున్న ఓ సీఎంను ఎవరి కాలిగోటికి సరిపోరంటున్నారని ఫైర్‌ అయ్యారు. కేటీఆర్‌ ఒక నియంత అని.. అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ తన వైఖరిని ఇకనైనా మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్‌, హరీశ్‌ రావుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘పులి మళ్లీ వస్తోంది.. కేసీఆర్‌ ఆరు నెలల్లో సీఎం అవుతారు’ అన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సీఎం ఎలా అవుతారో సమాధానం చెప్పాలని నిలదీశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. 50 రోజుల కాంగ్రెస్‌ పాలనను చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అహంకారంతో మతి భ్రమించి మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని సీఎం రేవంత్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

ఆ పార్టీలను దెబ్బ కొట్టాల్సిందే: జగ్గారెడ్డి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని, ఆ పార్టీల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పన్ని వాటిని రాజకీయంగా దెబ్బకొట్టాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. గత 9 ఏళ్ల పాలనలో ప్రజలకు బాధలు చెప్పుకొనే స్వేచ్ఛ కూడా లేకుండా కేసీఆర్‌ చేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుందనే తమ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని సీఎం రేవంత్‌ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసేది కాంగ్రెస్సేనని.. కులగణన చేశామని కేసీఆర్‌ అన్నారని, కానీ వివరాలు బయటికి రాకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు.

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై భేటీ..

లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపైన ప్రాథమిక కసరత్తు చేపట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ మంగళవారం గాంధీభవన్‌లో భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదా్‌సమున్షీ, కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఆశావహుల ప్రాథమిక వడపోతకు సంబంధించి మార్గదర్శకాలు, ఎన్నికల వ్యూహంపైనా ఈ కమిటీలో చర్చించనున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఆశావహుల జాబితాలను పంపించేశారు. ఆ జాబితాలపైనా కమిటీ.. ప్రాథమికంగా కసరత్తు చేపట్టనుంది.

Updated Date - Jan 30 , 2024 | 07:03 AM