Share News

నేడు బీఆర్‌ఎస్‌ ‘చలో నల్లగొండ’

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:43 AM

కృష్ణా జలాలపై నల్లగొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటే.. మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో, బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటాపోటీ సభలు, నిరసనలకు సిద్ధమయ్యాయి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ

నేడు బీఆర్‌ఎస్‌ ‘చలో నల్లగొండ’

కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పేరిట భారీ సభ.. హాజరుకానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌/నల్లగొండ, పిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలపై నల్లగొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటే.. మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో, బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటాపోటీ సభలు, నిరసనలకు సిద్ధమయ్యాయి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో బీఆర్‌ఎస్‌ మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. అధికార కాంగ్రెస్‌ కూడా పోటీ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. జిల్లా కేంద్ర సమీపంలోని నార్కట్‌పల్లి- అద్దంకి జాతీయ రహదారిని ఆనుకొని చర్లపల్లి బైపాస్‌ రోడ్డులో సుమారు 50 ఎకరాల్లో బీఆర్‌ఎస్‌ బహిరంగసభ నిర్వహించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఈ సభకు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజలాల్లో హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం తాము గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాలను కేసీఆర్‌ వివరించనున్నారు. కేంద్రం చేతికి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు వెళ్లకుండా తామేం చేశామనే అంశాలను ప్రజలకు వివరిస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంతో పాటు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సభకు హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. అయితే బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నల్లగొండలో కాంగ్రెస్‌ పోటీ నిరసన సభను నిర్వహించనుంది. గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలకు తెలియజేప్పేందుకు జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద గులాబీ రంగు కుర్చీ, గులాబీ కండువాతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయనున్నారు. దానిపై కేసీఆర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇలా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే రోజు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

Updated Date - Feb 13 , 2024 | 03:43 AM