మాటు వేసి.. వెంబడించిన చైన్ స్నాచర్లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:42 AM
ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు... విధులు ముగించుకుని గురువారం సాయంత్రం తన స్కూటీపై పాఠశాల నుంచి బయలుదేరారు.

ఉపాధ్యాయురాలి ఆభరణాలతో పరార్
స్కూటీపై పెద్దవూర నుంచి సాగర్‌కు వస్తున్న బాధితురాలు
మెడలోని తాళిబొట్టు, బంగారు గొలుసు అపహరణ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఘటన
నాగార్జునసాగర్, జూలై 4: ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు... విధులు ముగించుకుని గురువారం సాయంత్రం తన స్కూటీపై పాఠశాల నుంచి బయలుదేరారు. అప్పటికే మాటు వేసిన ఇద్దరు చైన్ స్నాచర్లు ద్విచక్ర వాహనంపై ఆమెను అనుసరించారు. సుమారు 20కిలోమీటర్ల దూరం వెంబడించి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల తాళిబొట్టు, బంగారు గొలుసు అపహరించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో ఈ సంఘటన జరిగింది. సాగర్ సీఐ భీసన్న, బాధితురాలు రూపారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీకి చెందిన మెట్ల రూపారెడ్డి పెద్దవూర జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఐదు గంటల సమయంలో తన స్కూటీపై పెద్దవూర నుంచి నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పెద్దవూర చౌరస్తా నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు దుండగులు ఉపాధ్యాయురాలి స్కూటీని అనుసరించి వస్తున్నారు. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ నర్సరీ వద్ద జనసంచారం లేదని గమనించిన దుండగులు స్కూటీపైనే ఉన్న ఉపాధ్యాయురాలి మెడలోని నాలుగు తులాల తాళి బొట్టు, బంగారు గొలుసు లాక్కొని మాచర్ల వైపు పరారయ్యారు. ఉపాధ్యాయురాలు స్కూటీపై నుంచి కింద పడిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల సీఐ తైలిపారు. సాగర్‌లోని అన్ని కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.