Share News

కేంద్ర ఉర్దూభాషాభివృద్ధి మండలి సభ్యుడిగా తెలుగు వ్యక్తి

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:43 AM

సీనియర్‌ జర్నలిస్టు, ప్రముఖ ఉర్దూ-తెలుగు అనువాదకుడు మెహక్‌ హైదరాబాదీ (పీవీ సూర్యనారాయణ మూర్తి) కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఉర్దూ భాషాభివృద్ధి జాతీయమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి తెలుగు

కేంద్ర ఉర్దూభాషాభివృద్ధి మండలి సభ్యుడిగా తెలుగు వ్యక్తి

సీనియర్‌ పాత్రికేయుడు మెహక్‌ హైదరాబాదీ నియామకం

ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ జర్నలిస్టు, ప్రముఖ ఉర్దూ-తెలుగు అనువాదకుడు మెహక్‌ హైదరాబాదీ (పీవీ సూర్యనారాయణ మూర్తి) కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఉర్దూ భాషాభివృద్ధి జాతీయమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఈ మేరకు మండలి డైరెక్టర్‌ ధనుంజయ సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మెహక్‌ హైదరాబాదీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం. ప్రఖ్యాత ఉర్దూ రచయితల కథా సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. కాల్పనిక, కాల్పనికేతర రచనలు తొమ్మిది వరకు పుస్తకాలుగా వెలువడ్డాయి. ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలానీబానూ కథలతోపాటు ఆమె బాల్య జ్ఞాపకాలు, సాదత్‌ హసన్‌మంటో కథలు, అమృతా ప్రీతమ్‌ నవల ‘అస్థిపంజరం’, హైదరాబాద్‌ సంస్థానంపై విప్లవ కవి మగ్దూం రాసిన వివాదాస్పద పుస్తకం అందులో ఉన్నాయి. గత 80ఏళ్లలో హైదరాబాద్‌లోని ఉర్దూ రచయితలు హిందువుల జీవితాలపై రాసిన ప్రత్యేక కథలను ‘గుల్‌ దస్త’ పేరుతో అనువదించారు. కొన్ని గజల్స్‌ రాశారు. మెహక్‌ను ఈ సందర్భంగా పలువురు తెలుగు, ఉర్దూ సాహిత్యకారులు అభినందించారు.

Updated Date - Feb 17 , 2024 | 03:43 AM