Share News

విద్య కాషాయీకరణకు కేంద్రం యత్నం

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:52 AM

‘నూతన విద్యావిధానం-2020 అమలు చేయడం ద్వారా విద్యను కాషాయికరణ, ప్రైవేటీకరణ చేయ కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

విద్య కాషాయీకరణకు  కేంద్రం యత్నం

నిరసన తెలిపినా దేశద్రోహం కేసులు

భారత్‌ బచావో సదస్సులో వక్తలు

హైదరాబాద్‌ సిటీ/రాంనగర్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘నూతన విద్యావిధానం-2020 అమలు చేయడం ద్వారా విద్యను కాషాయికరణ, ప్రైవేటీకరణ చేయ కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. నిర్బంధాలను నిరసిస్తూ ఉద్యమిస్తున్నవారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తున్నారని’’ అని పలువురు ఆరోపించారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రెండు రోజుల ‘‘భారత్‌ బచావో’’ జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్‌ అనితా రాంపాల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై నిర్బంధం ప్రయోగించిన విధంగానే విశ్వవిద్యాలయాల్లో కాషాయికరణకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించి అణిచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతుల ‘చలో ఢిల్లీ’ ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. అనితా హరగోపాల్‌ మాట్లాడుతూ భారత విద్యా వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు. నూతన విద్యావిధానం ద్వారా విద్యలో మత, మూఢ విశ్వాసాలను చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ మధు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, నిరసన తెలిపే హక్కులు కోల్పోయే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపీనాఽథ్‌ మాట్లాడుతూ యూనివర్సిటీలో భావప్రకటన స్వేచ్ఛ కోసం విద్యార్థి సంఘాలు కలిసి పనిచేయాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు తలచుకుంటే ఏదైనా సాధించగలరని, విద్యార్థుల న్యాయపోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Feb 26 , 2024 | 07:38 AM