Share News

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. 10 లక్షల కోట్లు!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:54 AM

కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై 40 సార్లు లేఖలు రాసినా స్పందన లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సర్కారు సహకారం

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. 10 లక్షల కోట్లు!

రీజనల్‌ రింగ్‌రోడ్‌ అభివృద్ధికి రూ.26 వేల కోట్లు

ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం

డబ్బులివ్వకుంటే కేంద్ర నిధులతో పూర్తిచేశాం

అభివృద్ధి పనులకు స్థలాలు కూడా ఇవ్వలేదు

కేంద్రమంత్రిగా నాకివ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు

అప్పటి సీఎం కేసీఆర్‌ అనరాని మాటలన్నారు

రాష్ట్ర అభివృద్ధిపై నేను నిర్వహించే సమీక్షలకు

ఉన్నతాధికారులు హాజరయ్యేవారు కాదు

కేసీఆర్‌కు 40 లేఖలు రాసినా స్పందించలేదు

గత ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు

‘రిపోర్ట్‌ టు ద పీపుల్‌’ ప్రజెంటేషన్‌లో కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై 40 సార్లు లేఖలు రాసినా స్పందన లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సర్కారు సహకారం లేకున్నా సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి, తెలంగాణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం కూడా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వలేదని.. అభివృద్ధిపై తాను సమీక్షలు జరిపితే జీహెచ్‌ఎంసీ, కలెక్టరేట్‌ నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యేవారు కారని వాపోయారు. వందల సంఖ్యలో వినతి పత్రాలిస్తే.. కనీసం వాటిని అందుకున్నామని కూడా తెలియజేయలేదని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని పింగళి వెంటకట్రామిరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆయన ‘రిపోర్ట్‌ టు పీపుల్‌’ (ప్రజలకు నివేదన) అనే పేరుతో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి.. ఎంపీగా, కేంద్రమంత్రిగా తాను సికింద్రాబాద్‌, తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అయితే.. అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో పలు కార్యక్రమాలు వాయిదా పడ్డాయని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. అభివృద్ధికి అవసరమైన స్థలాలను కేటాయించకకపోవడంతో అనే క పనులు కుంటుపడ్డాయన్నారు. ఒక కేంద్రమంత్రిగా లభించాల్సిన గౌరవం తనకు దక్కలేదని.. గత సీఎం తనను అనరాని మాటలన్నారని, దుర్భాషలాడారని.. చాలా బాధతో ఈ మాటలు చెబుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ కేసీఆర్‌ విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఇదీ లెక్క

కేంద్రం 2014 నుంచి తెలంగాణకు పన్నుల రూపేణా రూ.2.3 లక్షల కోట్లు, వివిధ పథకాల కింద రూ. 6.2 లక్షల కోట్లు.. ఇలా మొత్తంగా 9 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తన నివేదికలో వివరించారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో తెలంగాణలో 2,500 కి.మీ. జాతీయ రహదారులు వేశామని.. మరిన్ని జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మిస్తున్నామని.. దానికి రూ.26,000 కోట్లు కేటాయించామని, అది పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయని, ఆర్‌ఆర్‌ఆర్‌ తెలంగాణ గేమ్‌ చేంజర్‌గా మారుతుందన్నారు. యూపీఏ హయాంలో తెలంగాణలో ఏడాదికి 17 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే, తమ హయాంలో రూ.31,221 కోట్ల ఖర్చుతో 1,645 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టామని, కాజీపేటలో ఆర్‌ఎంయు యూనిట్‌ను ప్రధాని ప్రారంభించారని గుర్తు చేశారు. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు నిర్మిస్తామని తెలిపారు. రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రా న్ని ప్రారంభించామని.. హైదరాబాద్‌ మెట్రోకు రూ.1204 కోట్ల నిధులు కేటాయించామని.. సిద్దిపేట జిల్లా ములుగులో కొండా లక్షణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ నిర్మించామని.. రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేశామని.. ఎరువుల మీద 27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ తెలంగాణ రైతులకు కేంద్రం అందజేసిందని.. ఒక్క యూరియా బస్తా మీదే 2236 సబ్సిడీ ఇస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో 39లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ ద్వారా ఏటా 6వేలు అందజేశామని తెలిపారు. హైదరాబాద్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఎయిర్‌పోర్టు మాదిరిగా..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను కేంద్రం వచ్చే ఏడాది నాటికి శంషాబాద్‌ విమానాశ్రాయం మాదిరిగా తీర్చిదిద్దుతుందని.. రూ.715 కోట్లతో అభివృద్ధి చేస్తుందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. చర్లపల్లి టెర్మినల్‌ ఆధునిక వసతులతో సిద్ధమవుతోందని.. దక్షిణ మధ్య రైల్వే దీన్ని సుమారు రూ.221 కోట్ల వ్యయంతో శాటిలైట్‌ రైల్వే టెర్మినల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తోందన్నారు. లింగంపల్లి-ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎ్‌సను ప్రారంభించామని, 343 కోట్ల వ్యయంతో 22 కి.మీ. మేర విస్తరించిన లైనుతో పాటు ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థనూ ప్రధాని ప్రారంభించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 1000 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ ఐఐటీలో రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని.. మహిళల కోసం రూ.22 కోట్లతో నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రూ.6 కోట్లతో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 55 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు, హెల్దీ బేబీ షో కార్యక్రమం ద్వారా 7000 పోషణ కిట్లను పంపిణీ చేశామని.. ఓయూ క్యాంపస్‌ ఆర్ట్స్‌ కాలేజీలో డైనమిక్‌ లేజర్‌ షో, సైఫాబాద్‌లో మింట్‌ మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. రామప్ప ఆలయానికి ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు తేవడంలో ఎంతగానో కృషి చేసినట్టు తెలిపారు. దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-11 పనులను పూర్తిచేసి, సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈప్రాజెక్ట్‌ను యాదాద్రి వరకూ పొడిగించి వంద శాతం కేంద్ర నిధులతో చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎ్‌సకు తన వాటాను ఇవ్వకపోవడంతో కేంద్రమే ఖర్చును భరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రసాద్‌ పథకం కింద బల్కంపేట, భద్రాచలం, రామప్ప, అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయాల అభివృద్ధి, వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు చెప్పారు.

లోపాలు లేని ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు

జయప్రకాశ్‌ నారాయణ

‘‘చాలా మంది దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం నాశనమైందని అతియోశక్తులు పలుకుతున్నారు. కానీ, లోపా లు లేని ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు’’ అని లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి నిర్వహించిన రిపోర్ట్‌ టు ద పీపుల్‌ ప్రజెంటేషన్‌లో పాల్గొన్న జేపీ.. ఈ కార్యక్రమానికి తాను ఆయన స్నేహితుడిగా రాలేదని, ఓటర్‌ గా వచ్చానని చెప్పారు. కిషన్‌రెడ్డి సంస్కారి, స్నేహశీ లి అని.. చిత్తశుద్ధి, నిజాయితితో నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. కేంద్రమంత్రి అనే భావన లేకుండా.. చిరునవ్వుతో, విసుగు అనుకోకుండా ఏ విషయంలోనైనా త్వరగా స్పందిస్తారన్నారు. దేశ అభ్యున్నతి కోసం కేంద్రం చాలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి తమ మంచిని తాము తెలుసుకుని ఓట్లు వేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 04:54 AM