Share News

త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ పరిశ్రమలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:34 AM

‘‘నా ప్రతీ కష్టంలో కొడంగల్‌ ప్రజలు అండగా ఉన్నారు. నన్ను ఇంతగా ఆదరించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నన్ను సీఎం పదవిలో కూర్చోబెట్టిన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి

త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ పరిశ్రమలు

ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు

ఫ్యాక్టరీలకు భూములివ్వకపోవడం పద్ధతి

కాదు.. భూ సేకరణకు సహకరించాలి

పట్టా, అసైన్డ్‌ భూములకు ఒకటే ధర

కొడంగల్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా

తీర్చిదిద్దుతాం.. కార్యకర్తలతో భేటీలో సీఎం

6న తుక్కుగూడ సభకు రావాలని పిలుపు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86ు పోలింగ్‌

కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్‌రెడ్డి

కొడంగల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘నా ప్రతీ కష్టంలో కొడంగల్‌ ప్రజలు అండగా ఉన్నారు. నన్ను ఇంతగా ఆదరించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నన్ను సీఎం పదవిలో కూర్చోబెట్టిన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు గురువారం కొడంగల్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలోనే కొడంగల్‌ ప్రాంతానికి సిమెంట్‌ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో సున్నపు గనులు ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదన్నారు. సిమెంట్‌తోపాటు ఫార్మా పరిశ్రమలు ఏర్పాటైతే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోకాపేటలో ఐటీ పరిశ్రమలు రావడం వల్లనే అక్కడి భూముల ధరలు పెరిగి ఎకరం రూ.100కోట్లు పలుకుతోందని, అక్కడి రైతులు శ్రీమంతులయ్యారని గుర్తు చేశారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా పరిశ్రమలు వస్తేనే భూముల ధరలు పెరుగుతాయన్నారు. భూసేకరణకు ప్రజలు సహకరించకుంటే ఈ ప్రాంతం నష్టపోతుందన్నారు. సామాజిక అభివృద్ధి పనులకు భూములివ్వకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు భవిష్యత్తులో మరోసారి అవకాశం వస్తుందో రాదో తెలియదని, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పారు. భూసేకరణలో పట్టా భూములకు ఎంత ధర ఇస్తామో.. అసైన్డ్‌ పట్టా రైతులకు కూడా అంతే ధర చెల్లించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పై ఉంటుందన్నారు. అభివృద్ధి అంటే రానున్న రోజుల్లో కొడంగల్‌నే ఆదర్శంగా తీసుకునేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నారాయణపేట-కొడంగల్‌ లిఫ్ట్‌తో లక్ష ఎకరాలకుపైగా నీరు అందనుందని చెప్పారు. కొడంగల్‌ అభివృద్ధికి అంతా కలిసి రావాలని కోరారు. తాను ఏ స్థాయికి ఎదిగినా కొడంగల్‌ కుటుంబ సభ్యుడినే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి కొడంగల్‌ నుంచి 50 వేల మెజార్టీ అందించి తన గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్‌ బహిరంగ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి బలాన్ని ఢిల్లీలో చాటేలా లోక్‌సభ ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రేవంత్‌ను కలిసిన నీలం మధు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించడంపై సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

యేసు బోధనలు మానవాళికి స్ఫూర్తిదాయకం

గవర్నర్‌, సీఎం గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): గుడ్‌ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసు చూపిన కరుణ, సేవ, ప్రేమ మార్గంలో అందరం పయనించాలన్నారు. యేసు బోధనలు మానవాళికి ఎంతో స్ఫూర్తిదాయకమని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు యేసు క్రీస్తు నేర్పిన త్యాగం, సేవ, దయ, ప్రేమ, సోదరభావం ఎన్నటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకొనే గుడ్‌ఫ్రైడే వేడుకలను క్రెస్తవ సోదర, సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తుచేసుకున్నారు. మంత్రి సీతక్క కూడా అందరికీ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 06:34 AM