‘కుల, మత రహిత’ గుర్తింపుపై మీ వైఖరేంటి?
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:33 AM
పాఠశాల రికార్డుల నుంచి జనాభా లెక్కల్లో నమోదు వరకు అన్ని సందర్భాల్లో తమను ‘కులం, మతం రహిత వర్గం’గా గుర్తించాలని కోరే వారిపై వైఖరి ఏమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై మూడువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్
రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పాఠశాల రికార్డుల నుంచి జనాభా లెక్కల్లో నమోదు వరకు అన్ని సందర్భాల్లో తమను ‘కులం, మతం రహిత వర్గం’గా గుర్తించాలని కోరే వారిపై వైఖరి ఏమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై మూడువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘కులం, మతం లేదు ’ అన్న గుర్తింపు ఇవ్వాలన్న తమ వినతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటూ డీవీ రామకృష్ణారావు, ఎస్ క్లారెన్స్ కృపాళిని తదితరులు 2017లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న రిజిస్ర్టార్ జనెరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా తరఫున హైదరాబాద్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఇది తమ పరిధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని గమనించిన ధర్మాసనం మూడువారాల గడువు ఇచ్చి తదుపరి విచారణను వాయిదా వేసింది.