సీఎంఆర్ పూర్తి చేయకపోతే కేసులు
ABN , Publish Date - Jan 10 , 2024 | 11:14 PM
జిల్లాలోని రైస్ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ పూర్తి చేయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి హెచ్చరించారు.
నెలాఖరులోగా ఎస్‌సీఐకి చేర్చాలి
వికారాబాద్, మేడ్చల్ జిల్లాల అదనపుకలెక్టర్లు లింగ్యానాయక్ , విజయేందర్‌రెడ్డి
మేడ్చల్ జనవరి 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలోని రైస్ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ పూర్తి చేయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లాలోని రైస్ మిల్లులను పౌరసరఫరాలతో అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలలోనినిల్వ, సీఎంఆర్ పెట్టిన వివరాలు, బకాయి ఎంత ఉందో రికార్డులు పరిశీలించారు. రైస్ నాణ్యత పరిశీలించారు. ఈ నెలాఖరులోగా బకాయిలు ఉన్న సీఎంఆర్ పూర్తి చేయాలని, రైస్ మిల్లర్ల యజమానులు రోజువారి లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దృష్టిసారించాలని మిల్లర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజరు రాజేందర్ పాల్గొన్నారు.
31లోగా సీఎంఆర్‌ను ఎస్‌సీఐకికి చేర్చాలి
వికారాబాద్/యాలాల, జనవరి 10 : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఈనెల 31వ తేదీలోగా రైస్ మిల్లర్లు ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సిందేనని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ స్పష్టం చేశారు. బుధవారం యాలాల్ మండలంలోని బాలాజీ, వెంకట పద్మావతి రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు రోజు వారీ లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ సరఫరా చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐకి చేరవేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం నిల్వలు, గన్నీ బస్తాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్తా ఉన్నారు.