Share News

నమస్తే తెలంగాణ పత్రికపై కేసు

ABN , Publish Date - Mar 10 , 2024 | 04:09 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారంటూ వార్తను ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసు నమోదైంది. దీనిపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు

నమస్తే తెలంగాణ పత్రికపై కేసు

చంద్రబాబు, రేవంత్‌ భేటీ అయ్యారంటూ.. తప్పుడు వార్తను ప్రచురించిందని ఆరోపణ

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహేశ్‌ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారంటూ వార్తను ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసు నమోదైంది. దీనిపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 505(1)(బీ)(సీ), 505(2) రెడ్‌ విత్‌ 109 ప్రకారం.. క్రైం నెంబర్‌ 154/2024 కింద కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుకు సంబంధించి మహేష్‌ కుమార్‌గౌడ్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లే సమయంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో భేటీ అయ్యారంటూ ఆ పత్రిక ఓ వార్త రాసిందని.. ఇది వాస్తవం కాదని మహేశ్‌ పేర్కొన్నారు. ఆ రోజు రేవంత్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి, 3.37 గంటలకు వెళ్లిపోయారని, చంద్రబాబు మధ్యాహ్నం 2.45 గంటలకు వచ్చి, 3.07 గంటలకు వెళ్లిపోయారని వెల్లడించారు. చంద్రబాబు లాంజ్‌లోకి రాకుండానే వెళ్లిపోయారని, రేవంత్‌రెడ్డి లాంజ్‌లో 10 నిమిషాలు మాత్రమే ఉన్నారని, ఈ దృష్ట్యా ఇద్దరూ కలుసుకోవడానికి అవకాశమే లేదని వివరించారు. కానీ.. ఇద్దరూ 3.30 నుంచి 2 గంటల పాటు సమావేశమయ్యారని నమస్తే తెలంగాణ పత్రిక వార్తను ప్రచురించిందని తెలిపారు. రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు.. రేవంత్‌ సహాయాన్ని కోరారని.. ఆర్థిక సాయం కూడా చేయాలని అడిగినట్లు రాశారని తెలిపారు. దీనికి రేవంత్‌ అంగీకరించారని.. ఆయన చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారంటూ అసత్య కథనం రాశారని మహేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 10 , 2024 | 07:01 AM