కాంటాలేవి?
ABN , Publish Date - May 10 , 2024 | 12:34 AM
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. దీంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. వాతావారణశాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.ఽ ఈదురుగాలులు, ఆకాల వర్షం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతుండటంతో వర్షం కురిస్తే ధాన్యమంత తడిసి ముద్ద అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్న ధాన్యం
20 రోజులు గడుస్తున్నా టోకన్లు ఇవ్వని అధికారులు
నత్తనడక సాగుతున్న ధాన్యం సేకరణ
అకాల వర్షాలతో భయపడుతున్న అన్నదాతలు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. దీంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. వాతావారణశాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.ఽ ఈదురుగాలులు, ఆకాల వర్షం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతుండటంతో వర్షం కురిస్తే ధాన్యమంత తడిసి ముద్ద అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఘట్‌కేసర్ రూరల్, మే 9: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చే రైతులు ఇబ్బందులు కలిగించొద్దు.. వారికి కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి..అని అధికారులు, ప్రజాప్రతిధులు చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీలు సరిపడా లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుక్చొ 25 రోజులు గడుస్తున్నా హమాలీలు లేక ధాన్యం కేంద్రాల్లో మగ్గుతోంది. వాతావరణంలో మార్పులతో ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి సీజన్‌లో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం నుంచే అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. మండలంలో 3,850 ఎకరాల్లో వరి సాగు చేసారని అధికారులు పేర్కొనగా, అనధికారికంగా 4వేల ఎకరాల్లో సాగుచేశారని రైతులు పేర్కొంటున్నారు. యాసంగి సీజన్‌లో 5నుంచి 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అధికారులు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకూ 1, 040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మండల పరిధిలోని ఎదులాబాద్, మాధారం గ్రామాల్లో అధికారులు గతనెల 26న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతా్‌పసింగారంలో అలస్యంగా ఈనెల 7న ప్రారంభించారు. ముందుగానే వరికోతలు చేపట్టిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంధ్రాలకు తీసుకొచ్చి దాదాపు 25 రోజులు అవుతోంది. అయితే కేంద్రాల్లో హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. అరకొరగా హమాలీలు ఉండడంతో తూకాలు జరగక కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. బిహార్ రాష్ట్రం నుంచి హమాలీలు ప్రతిసీజన్‌లో మండలానికి వస్తుంటారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో చాలా మంది హమాలీలు రాలేదు. వరికోతలు చాలావరకు పూర్తి కావడంతో కొనుగోలు కేంధ్రాల్లో ధాన్య ఆరబెట్టుకోవడానికి స్థలం లేకుండా పోయింది. సరిపడా హమాలీలను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు వాపోతున్నారు. ప్రతి యేటా ఈ సమయానికి దాదాపు 50 వేల బస్తాలను (ఒక బస్తాలో 40కిలోల వడ్లు) తరలించేవారు. కానీ హమాలీలు లేక మాదారం కొనుగోలు కేంద్రం నుంచి 14 వేల బస్తాలు, ఎదులాబాద్ నుంచి 11 వేల బస్తాలు, ప్రతా్‌పసింగారం నుంచి 1,250 ధాన్యం బస్తాలను మాత్రమే కొనుగోళ్లు చేసి లోడింగ్ చేశారు. ఎదులాబాద్, మాదారం కేంద్రాల్లో 60 మంది హమాలీలు ఉండాల్సిన చోట 30 మందితో సరిపెట్టుకోగా, ప్రతా్‌పసింగారంలో 15 మందికి గాను 12 మందితో బస్తాలను కొనుగోళ్లు జరుగుతున్నాయి. మరో పక్క ఉన్న హమాలీలు ఈ ఎండలకు ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మాత్రమే ధాన్యం తూకాలు వేస్తున్నారు. దీంతో కొనుగోళ్లలో రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతుండటంతో వర్షం భయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండ పోయింది. రాత్రిసమయంలో ధాన్యంపై కవర్లు కప్పినా ఈదురుగాలులకు కవర్లు ఎగిరిపోయి ధాన్యం తడుస్తుందని అక్కడే పడిగాపుల కాయాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా టార్ఫలిన్లకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైన వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇచ్చి సరిపడా హమాలీలను సమకూర్చి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.
20 రోజులుగా పడిగాపులు
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఉన్న హమాలీలు ఎండలకు భయపడి ఉదయం 6 గంటల నుంచి 11.30 సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు పనిచేస్తున్నారు. దీంతో ధాన్యం కాంటా వేయడానికి, లోడింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి. అధికారులు చర్యలు తీసుకోవాలి.
- అరిగే లక్ష్మయ్య, రైతు, మాదారం
వాతావరణం చూస్తే భయమేస్తుంది
వాతావరణంలో మార్పులతో భయమేస్తుంది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మగ్గుతోంది. సాయంత్రం పూట ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు వస్తున్నాయి ఎప్పడు వర్షం పడుతుందోనని భయం. ధాన్యం ఆరబోయడానికి కవర్లకే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. హమాలీలు లేక రోజుల తరబడి వవర్లలోనే ఉంచాల్సి వస్తుంది.
- జెనిగె లింగం, రైతు ఎదులాబాద్
హమాలీలను తీసుకురావాలి
ఎదులాబాద్ కొనుగోలు కేంద్రంలో 40 మంది హమాలీలకు 15 మంది, మాదారంలో 30 మంది కావాల్సి ఉండగా 15 మందితో సరిపెడుతున్నారు. దీంతో ధాన్యం తరలించడంలో జాప్యం జరుగుతుంది. దీనికి తోడు ఎండలు తీవ్రంగా ఉండటంతో హమాలీలు మధ్యాహ్నం సమయంలో పనిచేయడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి కొనుగోలు కేంధ్రాలకు సరిపడా హమాలీలను కేటాయించాలి
- కొమ్మిరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి, రైతు, ఎదులాబాద్
హమాలీల కొరత లేకుండా చూస్తాం
ఎదులాబాద్ కొనుగోలు కేంద్రంలో సెంటర్‌లో ప్రస్తుతం 15 మంది హమామీలు పనిచేస్తున్నారు మరో 15 మందిని బిహర్ నుంచి రప్పిస్తున్నాము. ఈ రోజు హమాలీలు పనిలో చేరుతారు. హమాలీల కొరత లేకుండా చూస్తాం.
-విక్రమ్, ఎదులాబాద్ ధాన్యం కొనుగోలు కేంఽద్రం ఇన్‌చార్జి