Share News

మినీ స్టేడియం ఏర్పాటు కలేనా?

ABN , Publish Date - May 22 , 2024 | 11:33 PM

పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా మహేశ్వరంలో మినీ స్టేడియ నిర్మాణం మాత్రం పదేళ్లుగా హామీలకే పరిమితమైంది. స్టేడియం నిర్మాణానికి ఎవరూ శ్రద్ధవహించడం లేదు.

మినీ స్టేడియం ఏర్పాటు కలేనా?

మహేశ్వరంలో హామీలకే పరిమితమైన స్టేడియం నిర్మాణం

రియల్‌ వెంచర్లు, వ్యవసాయక్షేత్రాల్లో క్రీడాకారుల సాధన

కొరవడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం

మహేశ్వరం, మే 22 : పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా మహేశ్వరంలో మినీ స్టేడియ నిర్మాణం మాత్రం పదేళ్లుగా హామీలకే పరిమితమైంది. స్టేడియం నిర్మాణానికి ఎవరూ శ్రద్ధవహించడం లేదు. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైంది. మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయ లోపంతో స్టేడియం నిర్మాణానికి నోచుకోవడం లేదు. మహేశ్వరం సర్వే నంబర్‌ 306తో పాటు సిరిగిరిపురం రెవెన్యూలోగల ప్రభుత్వ భూమిలో మినీ స్టేడియాన్ని నిర్మించేందుకు అనుకూలంగా ఉందని రెవెన్యూ అధికారులు సూచించినా నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావడంలేదు. ఇందుకు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపమే కారణం అనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఒక మినీ స్టేడియం నిర్మించాలని విద్యార్థులు, క్రీడాకారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. మినీ స్డేడియం లేనందున మహేశ్వరంలో ప్రభుత్వ పరంగా, ప్రైవేట్‌గా క్రీడలు ఏవైనా ఏర్పాటు చేయాలంటే వ్యవసాయభూములు, చిన్నపాటి పాఠశాలల ప్రాంగణాలే దిక్కవుతున్నాయి. గ్రామాల్లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ అనువైన మైదానం లేక సాధన చేయలేకపోతున్నారు. నగరానికి వెళ్లి ప్రాక్టీస్‌ చేసే ఆర్థిక స్థోమత వారికి లేదు. మినీ స్టేడియం ఉంటే వాటిల్లో ఏర్పాటు చేసే క్రీడా పరికరాలతో పాటు విశాల మైదానంలో రోజూ ప్రాక్టీస్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించి మహేశ్వరంలో మినీ స్టేడియం కట్టించేందుకు కృషిచేయాలని గ్రామాల క్రీడాకారులు కోరుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 11:33 PM