Share News

బీఆర్‌ఎస్‌కు బై బై

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:43 AM

బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు

బీఆర్‌ఎస్‌కు బై బై

వరంగల్‌ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య

గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

కబ్జాలు, లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌ పరిణామాలు

బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠను దిగజార్చాయని అసంతృప్తి

కేసీఆర్‌కు లేఖ.. వరంగల్‌ నుంచే కాంగ్రెస్‌ తరఫున పోటీ!

కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారని తేటతెల్లం

ఆయనతో నేరుగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దల చర్చలు

ఒకట్రెండు రోజుల్లో శ్రీహరి, కావ్య కాంగ్రెస్‌లోకి

వీరితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలూ?

హైదరాబాద్‌, వరంగల్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఆమె లేఖ రాశారు. గులాబీ పార్టీకి కావ్య రాజీనామా చేయడంతో సీనియర్‌ నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారనేది స్పష్టమైంది. నేడో రేపో ఆయన బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. కడియం శ్రీహరిని కాంగ్రె్‌సలో చేర్చుకునేందుకు ఢిల్లీ అధిష్ఠానం పెద్దలే ఆయనతో చర్చించి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తొలుత కడియం కుమార్తె కావ్య బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యతో కలిసి ఒకట్రెండు రోజుల్లో కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా.. బీఆర్‌ఎస్‌ తరపున గట్టిగా గళం వినిపించే కడియం శ్రీహరి కూడా కాంగ్రె్‌సలో చేరనుండటం ఆ పార్టీకి గట్టి దెబ్బేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారం క్రితమే కావ్యను వరంగల్‌ స్థానం నుంచి అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. అప్పటి నుంచే ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే బీఆర్‌ఎ్‌సలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు నచ్చకే కడియ శ్రీహరి, కావ్య పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ నేతలపై భూ కబ్జాల ఆరోపణలు, లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాంపింగ్‌ లాంటి పరిణామాలు పార్టీ ప్రతిష్ఠ దిగజార్చాయంటూ కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నిన్నటిదాకా వరంగల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న కావ్య, అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నేతలతో కడియం శ్రీహరి చేసిన చర్చల్లో భాగంగా ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. కడియం శ్రీహరితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎ్‌సను వీడే ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉంటుందని, పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతుండటం గమనార్హం. రెండు మూడు రోజుల్లోనే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రె్‌సలో చేరేందుకు ముందుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అప్పుడు రంజిత్‌ రెడ్డి.. ఇప్పుడు కావ్య

పార్టీ కోరి కోరి టికెట్‌ ఇచ్చిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎ్‌సను వీడుతుండటం గమనార్హం. చేవెళ్ల స్థానం నుంచి సిటింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికే టికెట్‌ ఇస్తే, ఆయన కారు దిగి కాంగ్రె్‌సలో చేరారు. చేవెళ్ల నుంచే కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు. తాజాగా కావ్య కూడా అదే బాట పట్టడం గులాబీ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ పొందిన అభ్యర్థుల్లో ఇంకొందరు కూడా కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

గందరగోళ పరిస్థితులతోనే..

వరంగల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో బీఆర్‌ఎ్‌సలో నెలకొన్న గందరగోళ పరిస్థితులే కావ్య పోటీ నుంచి వైదొలగడానికి, పార్టీకి రాజీనామా చేయడానికి దారితీశాయని భావిస్తున్నారు. వరంగల్‌ టికెట్‌ను తొలుత అప్పటి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆశించారు. అప్పటికే తన కుమార్తె కావ్యను రాజకీయాల్లోకి తీసుకరావాలనే ఆలోచనలో ఉన్న కడియం శ్రీహరి, వరంగల్‌ ఎంపీ టికెట్‌ తనకే ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలను గుర్తించిన ఆరూరి రమేశ్‌.. తనకు టికెట్‌ రాదని భావించి బీజేపీ వైపు మొగ్గు చూపారు. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఆరూరికే టికెట్‌ ఇస్తామని కేసీఆర్‌ ఆఫర్‌ ఇచ్చారు. అయితే తనకు టికెట్‌ ఇచ్చినా పార్టీలో ఎవరూ సహకరించరంటూ రమేశ్‌, కేసీఆర్‌ ఆఫర్‌ను తిరస్కరించారు. అనంతరం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే ఈ నెల 13న కడియం కావ్యను వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలను కావ్య కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు కావ్యకు టికెట్‌ ఖరారు కావటంతో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ ఈ నెల 16వ తేదీన తన అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరారు. ఆ మరుసటి రోజైన 17వ తేదీన వరంగల్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్‌ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కీలక నేతలు పార్టీ వీడటం, కార్యకర్తల్లో గందరగోళం నెలకొడమే కావ్య రాజీనామా నిర్ణయానికి దారితీసినట్లు చెబుతున్నారు.

కేసీఆర్‌కు కావ్య రాజీనామా లేఖ (యథాతథంగా.. )

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారికి..

లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి వ్యవహారాలు, లిక్కర్‌ స్కాం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. జిల్లాల్లోని నాయకుల మధ్య సమన్వయం సహకారం లేకపోవడం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను గౌరవనీయులైన కేసీఆర్‌ గారు, పార్టీ నాయకత్వం, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నన్ను మన్నించ వలసిందిగా కోరుతున్నాను.

కేటీఆర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌

సీఎం రేవంత్‌పై అవినీతి ఆరోపణలే కారణం

హనుమకొండ టౌన్‌, మార్చి28: సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌పై హనుమకొండ పోలీ్‌సస్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రేవంత్‌ రూ.2,500కోట్లు వసూలు చేసి, ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్‌ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌ ఆఽధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు గురువారం హనుమకొండ సీఐ సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. హనుమకొండ పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత.. కేటీఆర్‌పై ఐపీసీలోని 504, 505 సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు.

Updated Date - Mar 29 , 2024 | 05:43 AM