సందడి సందడిగా..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:35 PM
బడి గంట మోగింది. పాఠశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థుల రాకతో స్కూళ్లలో సందడి వాతావరణం నెలకొంది.

విద్యార్థుల రాకతో మొదటిరోజు స్కూళ్లలో కేరింతలు
దోస్తులను కలుసుకున్న ఆనందంలో చిన్నారులు
ప్రభుత్వ బడుల్లో ప్రారంభమైన అడ్మిషన్లు
విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
మొదటి రోజు అంతంత మాత్రంగానే విద్యార్థుల హాజరు శాతం
ఎన్కతలలో తెరవని ఉర్దూ మీడియం పాఠశాల
వికారాబాద్/మేడ్చల్ , జూన్ 12(ఆంధ్రజ్యోతిది) : బడి గంట మోగింది. పాఠశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థుల రాకతో స్కూళ్లలో సందడి వాతావరణం నెలకొంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాఠశాలలను సుందరీకరించారు. వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉదయమే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడంతో సందడి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరించి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఉదయమే సిబ్బంది శుభ్రం చేసి సిద్దం చేశారు. తాగునీటి వసతి వంటివి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనం కూడా అందించారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు కూడా అందజేశారు. మొదటి రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంది. దాదాపు సగానికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. చాలా రోజుల తరువాత స్నేహితులు కలవడంతో విద్యార్థులు ఆప్యాయతతో పలుకరించుకోవడం కనిపించింది. మేడ్చల్ జిల్లా నూతన్‌కల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను కలెక్టర్ గౌతమ్ అందజేశారు. ఆయా పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రామలు చేపట్టారు.
ఫ ఉపాధ్యాయుల రాక కోసం విద్యార్థుల నిరీక్షణ
మోమిన్‌పేట్ : పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మోమిన్‌పేట మండలంలోని ఎన్కతల గ్రామంలో ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలకు మొదటి రోజు తాళం తెరవలేదు. ఉపాధ్యాయుల రాకకోసం విద్యార్థులు పాఠశాల ఆవరణలో నిరీక్షించారు. ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు టేకులపల్లి నుంచి గత సంవత్సరం డిప్యూటేషన్‌పై వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఎన్కతల గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. కాగా మోమిన్‌పేట్ మండల కేంద్రంలో మండల విద్యావనరుల కేంద్రం నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులతో పుస్తకాలను ఆటోలు, కార్లలోకి మోయించారు.
జిల్లాలో అమ్మ అదర్శ పాఠశాలలకు రూ.12 కోట్లు
మేడ్చల్‌టౌన్: ఆమ్మ ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించటానికి ప్రభుత్వం తరపున జిల్లాకు రూ.12 కోట్లు మంజూరు చేశామని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం నూతన్‌కల్‌గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించే విధంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని సూచించారు. తను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు ఈ స్థితికి చేరానని కలెక్టర్ తెలిపారు. అంతకు ముందు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందజేశారు. నూతన్‌కల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్ది లక్ష్మీ ప్రసన్నకు అత్యధిక మార్కులు సంపాదించటంతో కలెక్టర్ ప్రశంస పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ కుమారి, డీఆర్‌డీవో సాంబశివరావు, ప్రత్యేక అధికారి మేరీరేఖా, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయేందర్ రెడ్డి, తహసీల్దార్ శైలజ, ప్రధానోపాధ్యాయుడు కొండయ్య పాల్గొన్నారు.
మొదటి రోజు హాజరు అంతంతే.. బడికి వచ్చింది 30శాతం మంది విద్యార్థులే
రంగారెడ్డి అర్బన్ : బడి గంట మోగింది. 48 రోజుల తర్వాత పాఠశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో ఆట పాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. కొత్త ఆశలు.. కొంగొత్త ఆలోచనలతో నూతన విద్యాసంవత్సరంలోకి విద్యార్థులు అడుగు పెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థుల రాకతో స్కూళ్లలో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని పలు విద్యాలయాల్లో మొదటి రోజు స్కూల్‌కు వచ్చిన చిన్నారులకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దోస్తులను కలుసుకున్న ఆనందంలో చిన్నారులు కేరింతలు కొట్టారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాఠశాలలను సుందరీకరించారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పనులను ప్రారంభించారు. తొలిరోజే ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠ్యపుస్తకాలు అందజేశారు.
మొదటి రోజు హాజరు అంతంతే!
మొదటి రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంది. జిల్లాలో 1,45,500మంది విద్యార్థులకు గాను 43,650 మంది మాత్రమే పాఠశాలలకు హాజరయ్యారు.30 శాతం హాజరు నమోదైంది. యాచారం మండలం మేడిపల్లిలో తరగతి గదులు మరమ్మత్తు కారణంగా టెంట్లు వేసి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు. శంకర్‌పల్లి మండలం రామాంతపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి హాజరయ్యారు. యాచారం ఉన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. ఆమనగల్లు బాలుర ఉన్నత పాఠశాలలో మొదటి రోజు విద్యాబోధన జరగకపోవడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే గడిపారు. కేశంపేట మండలం నిర్దవెల్లి ఉన్నత పాఠశాలలో మొదటి రోజే టాయిలెట్లు, తరగతి గదులకు మరమ్మతులు చేపట్టారు. దీంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేసి వెంటనే ఇంటికి పంపించారు.