వికారాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ స్టాప్ !
ABN , Publish Date - May 12 , 2024 | 12:01 AM
బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ స్టాప్ హైదరాబాద్ తర్వాత వికారాబాద్‌లో ఉంటుందని, కొండా మీకు అండగా ఉంటాడని, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని చేవెళ్ల ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.

కొండా మీకు అండ.. ఎంపీగా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు ఆమోదం
బీజేపీ వికారాబాద్ జనసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
వికారాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ స్టాప్ హైదరాబాద్ తర్వాత వికారాబాద్‌లో ఉంటుందని, కొండా మీకు అండగా ఉంటాడని, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని చేవెళ్ల ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వికారాబాద్ ఎస్‌ఏపీ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ జనసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదని, మోదీ, రాహుల్‌ల్లో ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరున్నా..పనులు జరగడం లేదని, మరో కాళేశ్వరం మాదిరిగానే మారబోతోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో జిల్లా అభివృద్ధికి ఉజ్వల భవిష్యత్తు ఉండనుందన్నారు. రూ.1,100 కోట్లతో హైదరాబాద్ నుంచి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) ఫేజ్-2 పనులకు కేంద్రం అనుమతించిందని, త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. బుల్లెట్ ట్రైన్ తొలి స్టాప్ వికారాబాద్‌లో ఉంటుందని అమిత్‌షా అన్నారు. కొండా వెంకటరంగారెడ్డి కుటుంబం నుంచి వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డిని చేవెళ్ల ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే, చిల్కూరు బాలాజీ, సేవాలాల్ మహరాజ్, అమ్మపల్లి సీతారామచంద్రస్వామిని స్మరిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్‌షా... స్వాతంత్య్ర సమరయోధుడు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాతగారు, దివంగత ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.
గుల్బర్గా ఎంపీ డాక్టర్ ఉమేష్ జాదవ్ మాట్లాడుతూ,మూడోసారి ప్రధాని మోదీయేనని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నేత తూళ్ల వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ, దేశం, ధర్మం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మోదీని మూడోసారి ప్రధానిగా చూసేందుకు ప్రజలందరూ కంకణబద్దులుగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయమని, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ ఉద్యోగం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ తన హామీలను విస్మరించిందన్నారు. రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో ముందుకు సాగుతున్నారని ఆయన ఆరోపించారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ, జరుగుతున్న ఎన్నికలు ధర్మం, అధర్మం.., నీతి, నిజాయితీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ధర్మ, నీతి కోసం బీజేపీకి ఓటు వేయాలని .పిలుపునిచ్చారు. చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డి చివరకు ఆంజనేయుడి గుడి కూలగొట్టిన ఘనుడన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి మాట్లాడుతూ, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించి కాషాయ జెండా ఎగురవేస్తారన్నారు. పార్టీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం ఎంతో ఎదిగిందన్నారు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ మార్పింగ్ వీడియోలతో రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారంటూ ఆయన ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మచ్చలేని నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం మాజీ ఇన్‌చార్జి బి.జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి, పార్లమెంట్ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కన్వీనర్ మల్లారెడ్డి, కొండా విశ్వజిత్‌రెడ్డి, వెన్న ఈశ్వరప్ప, అంజన్‌కుమార్ యాదవ్, కంజర్ల భాస్కర్, సంగీతరెడ్డి, కె.శివరాజ్, సదానందరెడ్డి, రమే్‌షకుమార్, అమరేందర్‌రెడ్డి, రంగారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, వికారాబాద్ సభలో అమిత్‌షా చిల్కూరు, అమ్మపల్లి దేవుళ్లను స్మరించి అనంతగిరి కొండల్లో కొలువుదీరిన అనంతపద్మనాభస్వామి గురించి ప్రస్తావించకపోవడంతో స్థానికులు నిరాశకు గురయ్యారు.
పేదలను ఆదుకుంటున్న మోదీ : కొండా (బాక్స్ ఐటం)
చేవెళ్ల లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, చైనా, పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి మోదీ మన దేశాన్ని కాపాడుతున్నారన్నారు. పేద కుటుంబాలకు బియ్యం ఇచ్చి పేదలను ఆదుకుంటున్నారని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుతున్నారని చెప్పారు. మోదీ కష్టపడేదంతా మన దేశం, మన ప్రజల కోసమేనన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన సమయంలో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటే... పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి కొత్త ప్రభుత్వానికి చేతిలో చిప్ప పెట్టిందన్నారు. కాళేశ్వరం కట్టించి దివాలా తీయించారన్నారు. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయంటే అది మోదీ వల్లనేనని చెప్పారు. బియ్యమైనా, రైతులకు ఎరువులైనా, వీధి లైట్లయినా, చివరకు శ్మశాన వాటికలైనా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే కొనసాగుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటేసి చేవెళ్ల ఎంపీగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాషాయంలో నయా జోష్!
కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్ జిల్లా పర్యటన కాషాయంలో నయా జోష్ నింపింది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపింది. రంగారెడ్డి జిల్లా పేరు కొండా వెంకటరంగారెడ్డి పేరు నుంచే ఏర్పాటైందని, ఆ కుటుంబం నుంచే వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అమిత్ షా పిలుపునివ్వగా సభికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అమిత్ షా బహిరంగ సభతో వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో బీజేపీకి మరింత పట్టు పెరిగినట్లేనని ఆ పార్టీ భావిస్తోంది. జిల్లా పరిధిలోకి వచ్చే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ పైచేయి బీజేపీదేనన్న ధీమా కమలం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.