Share News

చిగురిస్తున్న ఆశలు!

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:24 PM

త్వరలో రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ... ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుపడంతో రేషన్‌కార్డు దారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

చిగురిస్తున్న ఆశలు!

సన్న బియ్యం పంపిణీతో లబ్దిదారుల్లో సంతోషం..

మేడ్చల్‌ జూన్‌ 11(ఆంధ్రజ్యోతి) : త్వరలో రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ... ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుపడంతో రేషన్‌కార్డు దారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని కూడా తెలుపడంతో లబ్ధ్దిదారుల్లో సంతోషం వ్యక్తమౌతున్నది. వరుస ఎన్నికల నేపఽథ్యంలో కోడ్‌ అమల్లో ఉన్నందున దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసి కోడ్‌ కూడా ఎత్తివేయడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్వరలో నూతనరేషన్‌ కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో ఆశావాహుల ఎదురుచూపులకు తెరపడనుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలంటే ఆహారభద్రత కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సుదీర్ఘ కాలంగా నూతన కార్డుల జారీ లేకపోవడంతో ఎందరో అర్హులు పథకాలకు దూరమౌతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలకు రేషన్‌ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో నిరుపేదలకు కార్డులేని కారణంగా ఇబ్బందులు ఎదురౌతున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. పథకాలు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తెల్ల రేషన్‌ కార్డు నిబంధన తప్పనిసరి కావడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో కేవలం ఒక్కసారి మాత్రమే కొత్త రేషన్‌కార్డులు జారీ చేశారు. ఆ తర్వాత 2024 నుంచి కొత్తవి జారీ లేకపోవడంతో వేలాది మంది పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో ఆహారభద్రత కార్డుల ప్రక్రియ చేపడ్తామని ప్రకటించినప్పటికీ సుమారు రెండు నెలలకుపైగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మరింత జాప్య జరిగిందనే చెప్పవచ్చు. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అప్పటి ప్రభుత్వం ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి దాని ప్రకారం ఒకసారి రేషన్‌ కార్డులు, పింఛన్లు జారీ చేశారు. ఆ తర్వాత కొత్తవాటి జోలికి వెళ్లలేదు. 2022 ఆగస్టులో కొందరికి మాత్రమే కార్డులు పంపిణీ చేశారు. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో సోదరులు విడిపోయి వేరే కాపురాలు పెట్టడం, తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ కొందరు పురుషుల పేర్లు తల్లిదండ్రుల కార్డుల్లోనే ఉండటం, వారి భార్యా పిల్లల పేర్లు పొందుపరిచే అవకశం కల్పించలేదు. దీనితో ఆ కుటుంబాలకు పథకాలు అందడం లేదు. దీనికి తోడు కార్డుల్లో మార్పులకు వెసులుబాటు కల్పించకపోవడంతో వేలాది మంది పేదలు స్థానికంగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా మంత్రి ప్రకటనతో సదరు దరఖాస్తులకు మోక్షం కలిగ అవకాశం ఉందని ఆశిస్తున్నారు. తక్షణమే సంబంధిత దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హులకు త్వరగా కార్డులు అందించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:24 PM