Share News

మల్కాజిగిరిలోనే తేల్చుకుందాం!

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:29 AM

‘లోక్‌సభ ఎన్నికల్లో నీ సిటింగ్‌ సీటులోనే తేల్చుకుందాం. రేవంత్‌! నీకు దమ్ముంటే సీఎం పదవికి, కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నేనూ సిరిసిల్ల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి వస్తా. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేద్దాం. ఎవరి సత్తా ఏంటో చూద్దాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

మల్కాజిగిరిలోనే తేల్చుకుందాం!

దమ్ముంటే సీఎం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా..

నేనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా

మల్కాజిగిరిలో ఎవరేంటో చూద్దాం

మేడిగడ్డపై ఎన్‌డీఎ్‌సఏది రాజకీయ ప్రేరేపిత నివేదిక

మా హరీశ్‌ చెప్పినట్లు మీకు చేతకాకుంటే దిగిపోండి

మేడిగడ్డకు పరిష్కారం చూపుతాం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ‘లోక్‌సభ ఎన్నికల్లో నీ సిటింగ్‌ సీటులోనే తేల్చుకుందాం. రేవంత్‌! నీకు దమ్ముంటే సీఎం పదవికి, కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నేనూ సిరిసిల్ల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి వస్తా. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేద్దాం. ఎవరి సత్తా ఏంటో చూద్దాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. దమ్ముంటే ఒక్క ఎంపీ స్థానంలో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలంటూ ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిగా.. ఎక్కడో ఎందుకు నీ సొంత నియోజకవర్గంలోనే తేల్చుకుందాం అంటూ ప్రతిసవాల్‌ విసిరారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం పరిధిలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిపించావ్‌? ఎంతమంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు గెలిచారు? అని రేవంత్‌ను నిలదీశారు. మల్కాజిగిరి నుంచి పోటీకి రేవంత్‌ సిద్ధమైతే.. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను బతిమాలి టికెట్‌ దక్కించుకుంటానన్నారు. మగాడివైతే మీ పార్టీని గెలిపించు అన్న సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఏం మాటలవి. గెలిస్తే మగవాడు. ఓడితే కాడా? అంటే ఎన్నికల్లో మగాళ్లు తప్ప ఆడవాళ్లు గెలవొద్దనా నీ ఉద్దేశం. 2018లో కొడంగల్‌లో ఓడినపుడు నువ్వు మగాడివి కాదా?’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, దాన్ని పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్‌కు తగదన్నారు. రేవంత్‌రెడ్డికి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ఉందని, తానే సీఏంనంటూ అన్ని సార్లు చెప్పుకొంటున్నారంటే.. సీఎంగానే ఉన్నాననే నమ్మకం రేవంత్‌కు లేనట్టుందన్నారు. మగాడివైతే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చెయ్యాలని, రైతుభరోసా ప్రారంభించి 70 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు వెయ్యాలని, మహాలక్ష్మి కింద దరఖాస్తు చేసుకున్న 1.60 లక్షల మంది అడబిడ్డలకు రూ.2500 ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

రేవంత్‌ది పేమెంట్‌ కోటా

‘నాది మేనేజ్‌మెంట్‌ కోటా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. రాహుల్‌, ప్రియాంకలది ఏ కోటా? అసలు రేవంత్‌రెడ్డిది మణిక్కం ఠాకూర్‌కు డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమెంట్‌ కోటా. అందుకనే ఢిల్లీకి పేమేంట్‌ చేయాల్సి వస్తోంది. తెలంగాణ నుంచి రేవంత్‌.. కర్ణాటక నుంచి డీకే శివకుమార్‌ ఇదే పని చేస్తున్నారు. రాష్ట్రంలోని బిల్డర్లను, వ్యాపారులను బెదిరిస్తున్నారు. త్వరలోనే బిల్డర్లు, వ్యాపారులు రేవంత్‌ సెస్‌పై రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈడీ, సీబీఐలపైనా అంత నమ్మకమా?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రానికి చెందిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) సంస్థ మేడిగడ్డపై ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైనదని, దాన్ని పట్టుకొని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. ఏకంగా ప్రాజెక్టు కూలిపోతుందని చెప్పడం తగదని కేటీఆర్‌ చెప్పారు. ఎన్‌డీఎ్‌సఏ మీద ఉన్న నమ్మకం.. ఈడీ, సీబీఐ వంటి ఇతర కేంద్రసంస్థలపై కూడా ఉందా అని ప్రశ్నించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బ్యారేజీకి బరాజ్‌కు తేడా తెలియదని.. అవగాహనా రాహిత్యంతో ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. గతంలో అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయని, ప్రభుత్వాలు మరమత్తులు చేసి కాపాడాయన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ఇంజినీరింగ్‌ పరిష్కారాలపై దృష్టి పెట్టకుండా.. మొత్తం కొట్టుకుపోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రూర రాజకీయానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కుంగిపోయిన పిల్లర్ల వద్ద కాపర్‌ఢ్యాం నిర్మాణం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపొచ్చు.. మా పార్టీనేత హరీశ్‌రావు చెప్పినట్లు మీకు చేతకాకుంటే అధికారం నుంచి దిగిపోయి మాకు అప్పజెప్పండి.. రెండు నెలల్లో దానికి తగిన పరిష్కారం చూపిస్తామని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కాళేశ్వరం, హెచ్‌ఎండీఏ.. ఇతర ఏ శాఖల్లో విచారణ జరిపినా తాము భయపడేదే లేదని, అన్యాయంగా నిందలు మోపితే న్యాయపోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలది అక్రమ సంబంధమని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో సరైన అభ్యర్థుల్లేక.. బీఆర్‌ఎ్‌సకు చెందిన వారిని కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని.. ఆరుకుపైగా స్థానాల్లో తమ పార్టీ నుంచి వెళ్లిన వారికి ఎంపీ టికెట్‌ ఇవ్వనున్నారని కేటీఆర్‌ చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులను కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారని.. షెడ్యూల్‌ విడుదలయ్యాక ఆయనే ప్రకటిస్తారన్నారు.

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ విడుదల చేయండి

ఓవర్సీస్‌ స్కాలర్‌షి్‌పలకు నిధులు విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రి, భట్టి విక్రమార్కకు కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. అమెరికాలో చదువుతున్న రవి అనే విద్యార్థి తాను ఫీజు చెల్లించాల్సి ఉందని, కానీ, రెండో విడత స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని తన దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌ ఈ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 04:29 AM