Share News

కేసీఆర్‌ను బద్నాం చేయాలె బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలె

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:01 AM

‘‘కేసీఆర్‌ను బద్నాం చేయాలె. బీఆర్‌ఎ్‌సను ఖతం చేయాలె. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజకీయం విధానం ఇదీ. బూతులు మాట్లాడడం, నోరు పారేసుకోవడం తప్ప ఈ ముఖ్యమంత్రికి పంటలు నీళ్లిచే మొహం లేదు. పైసలిచ్చే దమ్ము గానీ.. రైతు బంధు ఇచ్చే తెలివి

కేసీఆర్‌ను బద్నాం చేయాలె బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలె

రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజకీయ విధానం ఇదీ..

కేసీఆర్‌పై కోపంతో పంటలకు నీళ్లివ్వలేదు

సీఎం గుంపు మేస్త్రీ.. ప్రధాని తాపీ మేస్త్రీ

తెలంగాణ గొంతు నొక్కడమే వారి లక్ష్యం

నేతన్నల సమస్యలపైనా దీక్షలు: కేటీఆర్‌

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు

సిరిసిల్ల, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ను బద్నాం చేయాలె. బీఆర్‌ఎ్‌సను ఖతం చేయాలె. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజకీయం విధానం ఇదీ. బూతులు మాట్లాడడం, నోరు పారేసుకోవడం తప్ప ఈ ముఖ్యమంత్రికి పంటలు నీళ్లిచే మొహం లేదు. పైసలిచ్చే దమ్ము గానీ.. రైతు బంధు ఇచ్చే తెలివి గానీ లేదు. సీఎం గుంపు మేస్త్రీ అయితే.. ప్రధాని మోదీ తాపీ మేస్త్రీ లెక్క. ఇద్దరూ కలిసి తెలంగాణ గొంతును బంద్‌ చేయాలి.. సమాధి కట్టాలి.. అని చూస్తున్నారు’’ అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు నిర్వహించారు. సిరిసిల్లతోపాటు వేములవాడలో నిర్వహించిన రైతు దీక్షల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ ఏడు పదుల వయస్సులో ఆరోగ్యం బాగా లేకపోయినా పలు జిల్లాలకు కేసీఆర్‌ స్వయంగా వెళ్లి రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారని, అదే బాటలో అన్ని నియోజకవర్గాల్లోని అన్నదాతలకు గులాబీదండు అండగా ఉందని చాటి చెప్పేందుకే రైతు దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. రుణమాఫీతోపాటు ధాన్యానికి రూ.500 బోనస్‌ వస్తుందన్న ఆశతో రైతులు కాంగ్రె్‌సకు ఓటేసి గెలిపించారని అన్నారు. పాలు ఇచ్చే బర్రెను పంపించి, పొడిచే దున్నపోతును తెచ్చుకున్నామంటూ.. ఇప్పుడు తేలు కుట్టిన దొంగ లెక్క చెప్పలేక బాధ పడుతున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ రాకముందే జీవో తీసుకురావాలని తాము అడిగినా కాంగ్రెస్‌ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామంటే.. తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు

తాము అధికారంలో ఉన్నప్పుడు ఎండాకాలంలోనూ మేడిగడ్డ నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోశామని కేటీఆర్‌ గుర్తు చేశారు. నాలుగు నెలల్లోనే పరిస్థితి తారుమారైందని, ప్రస్తుతం పంటలు ఎండే పరిస్థితి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని కేటీఆర్‌ అన్నారు. ‘‘కాంగ్రెసోళ్లు కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. ఆయనపై కోపంతో పంటలకు నీళ్లివ్వట్లేదు. పంటలు ఎండితే కొనాల్సిన అవసరం ఉండదు..బోనస్‌ అసలే ఉండదు.. అందుకే కక్ష గట్టి కాళేశ్వరం కొట్టుకుపోయిందని దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెసోళ్లు ఒర్రితే యూట్యూబ్‌లో చిల్లరగాళ్లు కూడా ఒర్రుతున్నారు. వాళ్ల మాటలు నమ్మవద్దు’’ అని సూచించారు. 2లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా, రూ.500 బోనస్‌, 24 గంటల కరెంట్‌ అందుకున్న రైతులు కాంగ్రె్‌సకే ఓటేయాలని, మిగిలిన వాళ్లు కచ్చితంగా బీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలని కేటీఆర్‌ సూచించారు. ఎంపీ ఎన్నికల్లోనైనా మేల్కోకపోతే, మర్లపడకపోతే రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన కాగితాలు ఇస్తూ 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు రూ.500 బోనస్‌, మహాలక్ష్మి కింద రూ.2500 ఆడబిడ్డలకు ఇవ్వాలని సూచించారు. రుణమాఫీపై బీజేపీ నేత ఈటల మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ జరుగుతున్నాయని, వారి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే దీక్షలు చేపడుతామన్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌

పార్టీ ఫిరాయింపులను మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీయే ప్రోత్సహించిందని కేటీఆర్‌ అన్నారు. ఆ పార్టీ నేతలు చెప్పేదొకటి.. చేసేదొకటి అని విమర్శించారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటేయాలని, ఇదే అంశంపై తన మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్‌ ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుందని ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. కాగా, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంటు స్థానాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 14 మంది ఎన్నికల సమన్వయకర్తల్ని బీఆర్‌ఎస్‌ నియమించింది.

Updated Date - Apr 07 , 2024 | 04:01 AM