వర్గీకరణ కోసమే బీజేపీలో చేరా
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:12 AM
ఎస్సీ వర్గీకరణ కోసమే బీజేపీలో చేరుతున్నానని నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. దళితుల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణ చేస్తానని ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించారని, ఆయనపై తనకు నమ్మకం ఉందని
హామీ నెరవేరుస్తారనే నమ్మకముంది
నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ రాములు
బీజేపీ వైపు.. ఎంపీ బీబీ పాటిల్ చూపు..?
5న సంగారెడ్డిలో సభలో చేరే చాన్స్
న్యూఢిల్లీ/కామారెడ్డి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోసమే బీజేపీలో చేరుతున్నానని నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. దళితుల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణ చేస్తానని ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించారని, ఆయనపై తనకు నమ్మకం ఉందని అన్నారు. మోదీ ప్రకటనతో లక్షలాది మంది ఎస్సీలు ఎంతో సంతోషించారని, అందులో తానూ ఒకడినని చెప్పారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాములు.. ఆయన కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌తో కలిసి కమలం గూటికి చేరారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వారికి కండువా కప్పారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, అది మోదీతోనే సాధ్యమని చెప్పారు. దేశ ఖ్యాతి, వికసిత భారత్, పేదరిక నిర్మూలన కోసం అనేక మంది బీజేపీలో చేరుతున్నారని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఇక ముగిసిన అధ్యాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాములు చేరికతో ఉమ్మడి పాలమూరులో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ బీబీపాటిల్ బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు, ఢిల్లీ నేతలతో పాటిల్ చర్చలు జరిపినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభలోనే బీబీపాటిల్ బీజేపీలో చేరతారని చర్చ జరుగుతోంది. జహీరాబాద్ ఎంపీగా బీఆర్‌ఎస్ తరఫున రెండుసార్లు గెలుపొందినప్పటికీ.. ఆ పార్లమెంట్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాటిల్‌కు పూర్తిస్థాయిలో గుర్తింపు ఇవ్వలేదన్న వాదన ఉంది. ఒకానొక సమయంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనను బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అడుగుపెట్టనివ్వలేదనే చర్చ కూడా ఉంది.
ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం వంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉండవని పాటిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జహీరాబాద్ ఎంపీ సీటు కోసం ఆయన బీజేపీ అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే టికెట్ విషయంలో గ్యారెంటీ ఇవ్వలేమని బీజేపీ రాష్ట్ర నేతలు ఆయనకు చెప్పారని.. ఒకవేళ చర్చలు సఫలమైతే పాటిల్ బీజేపీలో చేరతారని సమచారం. ఇప్పటికే జహీరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం ఆ పార్లమెంట్ పరిధిలో సుమారు 15 మందికిపైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. జహీరాబాద్ కాకుంటే మహారాష్ట్రలో ఎక్కడో ఓ చోట పాటిల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
400కుపైగా సీట్లు సాధిస్తాం: గడ్కరీ
నిజామాబాద్, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు సాధిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశంలో గడ్కరీ మాట్లాడారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైవే రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి అక్రమాలే తప్ప ప్రజా సంక్షేమం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులను ప్రోత్సహించడం వల్లనే ధర పెరుగుతోందని చెప్పారు. కుటుంబ పాలన తప్ప కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు కుష్బూ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కుష్బూ పాల్గొన్నారు.