Share News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

ABN , Publish Date - Feb 24 , 2024 | 02:56 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే (కంటోన్మెంట్‌) లాస్య నందిత (37) ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  లాస్య నందిత దుర్మరణం

ఔటర్‌ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం

పటాన్‌చెరు సమీపంలో ముందున్న వాహనాన్ని, రెయిలింగ్‌ను ఢీకొన్న కారు

లాస్య తల, ముఖానికి తీవ్రగాయాలు.. విరిగిన దంతాలు, ఛాతీ ఎముకలు.. అక్కడికక్కడే మృతి

తండ్రి సంవత్సరీకం ముగిసిన 4 రోజులకే కన్నుమూత.. అధికారలాంఛనాలతో అంత్యక్రియలు

పాడె మోసిన మాజీ మంత్రులు హరీశ్‌, తలసాని.. సీఎం రేవంత్‌, కేసీఆర్‌ సహా పలువురి నివాళులు

పటాన్‌చెరు, సంగారెడ్డి క్రైమ్‌, హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే (కంటోన్మెంట్‌) లాస్య నందిత (37) ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శామీర్‌పేట నుంచి ముత్తంగి ఔటర్‌ జంక్షన్‌ వైపు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుల్తాన్‌పూర్‌ ఎగ్జిట్‌ దాటిన తరువాత పటాన్‌చెరు శివారు ప్రాంతంలో కారు అతివేగంగా.. గుర్తుతెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందువైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్‌ (26) తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్లూ విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్‌ పెట్టుకున్నా, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా.. ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గురువారం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్‌ షా దర్గాను సందర్శించారని.. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకునే క్రమంలో టిఫిన్‌ చేసేందుకు మరోమారు సంగారెడ్డి వైపునకు తిరుగు ప్రయాణం అయ్యారని పటాన్‌చెరు పోలీసులు తెలిపారు. ముత్తంగి జంక్షన్‌ వద్ద ఉన్న టిఫిన్‌ సెంటర్ల వద్దకు వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రమాదవార్త తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న పటాన్‌చెరు పోలీసులు.. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను మియాపూర్‌ శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే లాస్యనందితను పటాన్‌చెరులోని అమేఽధా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతి వార్త తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలవడం పట్ల ఆయన దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు. లాస్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె మృతిపై మాట్లాడాలని విలేకరులు కోరినా విషణ్నవదనంతో మౌనంగా ఉండిపోయారు. గాంధీ ఆస్పత్రిలోపో్‌స్టమార్టమ్‌ జరుగుతున్నంతసేపూ అక్కడి వెయిటింగ్‌ హాలులోనే కూర్చున్నారు. అనంతరం లాస్య ఇంటికి వెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించడంతోపాటు అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకూ ఉన్నారు.

డ్రైవర్‌ నిద్రమత్తు వల్లనే..

డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్‌ గ్రామంలోని మిస్కిన్‌ షా బాబా దర్గా సందర్శన అనంతరం.. లాస్య తన కుటుంబసభ్యులతో కలిసి రెండు కార్లలో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఆమె టీఎ్‌స09జీజీ టీఆర్‌ 1955 నంబర్‌ గల మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌ 6 కారులో ప్రయాణిస్తున్నారు. అల్పాహారం కోసం శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి సంగారెడ్డి వైపు వస్తుండగా సుల్తాన్‌పూర్‌ టోల్‌ప్లాజా దాటిన తర్వాత సుమారు 5.10 గంటల సమయంలో డ్రైవర్‌ ఆకాశ్‌ నిద్రమత్తులోకి జారుకుని, కారుపై నియంత్రణ కోల్పోయి, ఎడమ వైపు ఉన్న ఓఆర్‌ఆర్‌ మెటల్‌ బీమ్‌కు బలంగా ఢీకొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. కాగా.. 5.15 గంటల సమయంలో ఆకాశ్‌ తనకు ఫోన్‌ చేసి ప్రమాదం జరిగిందని, కేవలం గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపాడని లాస్య నందిత సోదరి నివేదిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ప్రమాద స్థలికి వచ్చి చూసేసరికి లాస్య చనిపోయి ఉందని ఆమె పేర్కొన్నారు. దీంతో డ్రైవర్‌ ఆకాశ్‌పై ఐపీసీ 304(ఎ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో కారు విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న తీరుచూస్తే.. ముందు వెళుతున్న వాహనం వెనకభాగాన్ని ఢీకొనగా, అది సుమారు వందమీటర్ల వరకు ఈ కారును ఈడ్చుకెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. ఆ వాహనం ఆచూకీ మాత్రం తెలియరాలేదు. అలాగే.. ప్రమాద సమయంలో వారి కారు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు స్పీడోమీటర్‌ వల్ల తెలుస్తోంది.

పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు..

ఈ ప్రమాదంలో లాస్య తలకు బలమైన గాయమై మరణించినట్టు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన వైద్యులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం ఉదయం 9.55 గంటల సమయంలో లాస్య భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగాధిపతి కృపాల్‌సింగ్‌, డాక్టర్‌ లావణ్య, పీజీ వైద్యులు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఆమె తలకు కుడిభాగంలో, మెడవద్ద తీవ్రగాయాలయ్యాయి. ఎడమ కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. ఛాతీ ఎముకలు విరిగాయి. వెన్నుకు తీవ్రగాయాలయ్యాయి. ఆరు దంతాలు పూర్తిగా విరిగిపోయాయి. తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అయితే, తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్ధితికి చేరుకుని అక్కడే మృత్యువాత పడినట్లు వైద్యులు అంచనాకు వచ్చారు. పోస్ట్‌మార్టమ్‌ పూర్తి నివేదిక రావాల్సి ఉంది. ఇక.. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న ఆకాశ్‌ కనుబొమ పైభాగం, ముఖం వద్ద చిన్న చిన్న ఫ్రాక్చర్లు అయినట్లు, ఎడమ కాలు తొడ వద్ద ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స చేస్తున్నామని చెప్పారు.

కన్నీటి నివాళులు..

లాస్య తండ్రి మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. నాలుగు రోజుల క్రితమే ఆయన ప్రథమ వర్ధంతి జరిగింది. అంతలోనే ఆయన కుమార్తె మృతి చెందడంతో.. వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. లాస్య మరణవార్త తెలియగానే ఆమె తల్లి గీత స్పృహ తప్పిపడిపోయారు. లాస్యను తలచుకుంటూ భోరున విలపిస్తున్న ఆమె తోబుట్టువులు నమ్రత, నివేదితను, కుటుంబసభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. ఏడాది వ్యవధిలో తండ్రి, తనయ మరణించడంతో కంటోన్మెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఉదయం 11.45 గంటలకు లాస్య భౌతికకాయాన్ని సికింద్రాబాద్‌ కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని నివాసానికి తీసుకువచ్చారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. అనంతరం మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచారు. లాస్య మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మేడారంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన రేవంత్‌.. నేరుగా లాస్య నివాసానికి చేరుకొని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతకుముందు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కేసీఆర్‌ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. లాస్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మృతదేహం రాక ముందే కార్ఖానాలోని ఇంటికి చేరుకున్నారు. లాస్య తల్లి గీత, సోదరి నమత్ర, నివేదితను ఓదార్చారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీలు కే కేశవరావు, సంతో్‌షకుమార్‌ తదితరులు కన్నీటి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, స్థానికులు లాస్య కడసారి చూపు కోసం తరలివచ్చారు. రేవంత్‌ ఆదేశాలతో లాస్యనందితకు వెస్ట్‌మారేడ్‌పల్లిలోని హిందూ శ్మశానవాటికలో రాత్రి 7.10 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హరీశ్‌, తలసాని, వేముల, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, పాడి కౌశిక్‌రెడ్డి పాడె మోశారు. సాయన్న మరదలు కుమారుడు పీయూష్‌ రాఘవ లాస్య చితికి నిప్పంటించారు. కాగా.. లాస్యనందిత మృతి పట్ల తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, మంత్రి కొండా సురేఖ, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. లాస్య మృతి పట్ల తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తంచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌.. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఓటమితో మొదలై..

దివంగత ఎమ్మెల్యే సాయన్నకు లాస్యనందితతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు నమ్రత, నివేదిత ఉన్నారు. కుటుంబ సభ్యులందరి ఆమోదంతో ఆయన లాస్య నందితను తన రాజకీయ వారసురాలిగా గతంలోనే ప్రకటించారు. 2015లో కంటోన్మెంట్‌ బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమిపాలైన లాస్య.. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్‌గా బరిలో నిలిచి విజయం సాధించారు. 2020 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కవాడిగూడ నుంచి మరోసారి పోటీ చేసిన లాస్య పరాజయం పాలయ్యారు. నిరుడు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసే అవకాశం ఆమెకు కల్పించింది. సాయన్నకు ఉన్న మంచి పేరు, ఆయన అనుచరుల కృషితో లాస్య 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తన తండ్రి స్ఫూర్తితో ఆమె సామాజిక సేవా కార్యక్రమాలూ నిర్వహించేవారని.. పుట్టినరోజు, ఇతర సందర్భాల్లో ఆహారం, చలికాలంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసేవారని పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ, ఎమ్మెల్యేగా ఎన్నికై మూణ్నెల్లు కాకముందే ఆమె మరణించడం విషాదం.

ఎప్పుడూ వెంట ఉండే గన్‌మెన్‌ లేకుండా ఎలా వెళ్లారు?

ఇరవై నాలుగు గంటలూ ఎమ్మెల్యేకు నీడలా ఉంటూ కాపాడే గన్‌మెన్‌ వెంట లేకుండానే ఆమె ప్రయాణం చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఎమ్మెల్యే కారు ప్రయాణించిన మార్గంలోని టోల్‌గేట్లు, సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు.

నాడు సాయన్నకు సాధారణ అంత్యక్రియలు

గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన సాయన్న అంత్యక్రియల నిర్వహణ అప్పట్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ శ్మశానవాటికలో ఆయన అనుచరులు నాడు ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పార్టీకి చెందిన నాయకులు సర్దిచెప్పడంతో కుటుంబసభ్యుల అంగీకారం మేరకు సాధారణంగానే అంత్యక్రియలు నిర్వహించారు.

వారం క్రితం ప్రాణాలతో బయటపడి..

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 3 ప్రమాదాలు

లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. రెండు ఘటనల్లో ప్రాణాలతో బయటపడిన ఆమె.. మూడో ప్రమాదంలో కన్నుమూశారు! వీటిలో మొదటి ప్రమాదం గత ఏడాది డిసెంబరు 24న జరిగింది. ఆరోజు ఆమె బోయిన్‌పల్లి బాపూజీనగర్‌ సమీపంలోని ఓప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ఆమె లిఫ్టులో ఇరుక్కోవడంతో.. దాన్ని పగలగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. తర్వాత, ఈనెల 13న నల్గొండలో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు హాజరైన లాస్య నందిత.. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె స్వల్పగాయాలతో బయట పడ్డారు. కానీ ఆమె కారు ఢీకొని.. బందోబస్తు విధుల్లో ఉన్న హోంగార్డు మృతి చెందాడు. సరిగ్గా వారంలోనే ఆమె ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూయడం విషాదం. కాగా.. లాస్య కుటుంబానికి ఒక పాత కారు, ఫార్చ్యూనర్‌ ఉన్నాయి. ఇటీవలే తెలిసిన బంధువుల పేరుతో ఎక్స్‌ఎల్‌6 కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రమాదానికి గురైంది ఆ కారే.

Updated Date - Feb 24 , 2024 | 02:56 AM