Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఆ స్కైవేల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:34 AM

‘ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు బీఆర్‌ఎస్‌ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉంది.

ఆ స్కైవేల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం

పదేళ్ల మా కష్టానికి ఫలితం దక్కింది

రక్షణ శాఖ భూములివ్వడం హర్షణీయం

నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు బీఆర్‌ఎస్‌ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌-కరీంనగర్‌, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారుల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల (స్కైవేల) నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలపడం హర్షణీయం. ఇది ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ సాధించిన విజయం’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది జూలై 31న జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామన్నారు. గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను రాష్ట్రానికి అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వెల్లడించారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు.. తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశామని, ప్రతి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు పోరాటం చేసిందని, ఇందులో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్లో ఇది సాధ్యం కాలేదని, ఇది సమష్టి విజయమని స్పష్టం చేశారు. తమ పాలనలో మెరుపు వేగంతో నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ల వల్ల హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ సమస్యలు శాశ్వతంగా తీరిపోయాయని పేర్కొన్నారు. ఇక కొత్త స్కైవేల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ఇన్నాళ్లకు తమ పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని, ఈ సందర్భంగా కేంద్ర పెద్దలకు కేటీఆర్‌ తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 04:34 AM