Share News

KTR : మోదీ కనుసన్నల్లో రేవంత్‌

ABN , Publish Date - May 07 , 2024 | 06:13 AM

‘ఒక ఆరెస్సెస్‌ వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నడు. ఆయన కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీతో నడుస్తలేడు. బీజేపీ, మోదీ కనుసన్నల్లో పాలన కొనసాగిస్తున్నడ’ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి

KTR : మోదీ కనుసన్నల్లో రేవంత్‌

ఆరెస్సెస్‌ వ్యక్తి తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు

ముఖ్యమంత్రివి చిల్లర మాటలు.. ఉద్దెర పనులు

హైదరాబాద్‌ను ఆగం చేయాలని మోదీ ప్రయత్నాలు

రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/సిరిసిల్ల/శంషాబాద్‌/సరూర్‌ నగర్‌ మే 6(ఆంధ్రజ్యోతి): ‘ఒక ఆరెస్సెస్‌ వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నడు. ఆయన కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీతో నడుస్తలేడు. బీజేపీ, మోదీ కనుసన్నల్లో పాలన కొనసాగిస్తున్నడ’ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ సామరస్యతతో ఉండే హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తున్నారని, ముస్లింలను దూషిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సిరిసిల్ల, హైదరాబాద్‌లోని కొండాపూర్‌, శంషాబాద్‌, సరూర్‌ నగర్‌లో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపడంతో ప్రజలు మోసపోయారు. మోచేతికి బెల్లంపెట్టి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్‌ నాయకులు గద్దెనెక్కారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డివి 150 రోజులైనా చిల్లర మాటలు, ఉద్దెర పనులేన’ని విమర్శించారు. రేవంత్‌ను నమ్మితే తులం బంగారం కూడా రాదన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నామని కాంగ్రె్‌సకు ఓటేయడంపై ప్రజలు బాధపడుతున్నారన్నారు. 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసిపోయాయని రాహుల్‌ గాంధీ అంటున్నారని, అదే నిజమైతే తన చెల్లెలు 50రోజులుగా జైలులో ఎందుకు ఉంటుందన్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటే రాష్ట్రం అడుక్కుతినే పరిస్థితి వస్తుందన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గతంలో తన నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేయించుకుంటే రేవంత్‌ రెడ్డి దాన్ని రద్దు చేసి, కొడంగల్‌కు పట్టుకుపోయారన్నారు. అదే నియోజకవర్గ అభివృద్ధికి నాటి సీఎం కేసీఆర్‌ రూ.170 కోట్లు మంజూరు చేస్తే ఆ నిధులను సైతం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బీజేపీ గత పదేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, నమో (నరేంద్ర మోదీ) అంటే నమ్మించి మోసం చేయడమన్నారు. పేదోళ్ల దగ్గర రూ.30 లక్షల కోట్లు దోచుకొని, పెద్దోళ్లు అదానీ, అంబానీలకు 14 లక్షల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. మోదీ దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్నారని, తాము యాదాద్రి ఆలయం నిర్మించామని దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగామా? అని ప్రశ్నించారు. బీజేపీ పంచిన అక్షింతలు అయోధ్య నుంచి రాలేదని, ఇక్కడే రేషన్‌ బియ్యంలో పసుపు కలిపారన్నారు. ‘రాముడికి మొక్కుదాం.. బీజేపీనీ తొక్కుదామ’ని అన్నారు. బీజేపీ కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఒక్క మంచి పనైనా చేశాడా? అని ప్రశ్నించారు. కరీంగనగర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీకే మాత్రమే పోటీ అన్నారు.

Updated Date - May 07 , 2024 | 06:13 AM