Share News

బీఆర్‌ఎస్‌.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు?

ABN , Publish Date - Mar 25 , 2024 | 05:43 AM

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎ్‌స)గా మారుతుందా? ఈ దిశగా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కసరత్తు చేస్తోందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు?

పేరు మార్చాల్సిందేనంటున్న పార్టీ శ్రేణులు!

బీఆర్‌ఎస్‌గా మార్చడంపై తీవ్ర అసంతృప్తి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే కారణమని ఆగ్రహం

పాత పేరు కోసం న్యాయ సలహాలపై అధిష్ఠానం దృష్టి

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎ్‌స)గా మారుతుందా? ఈ దిశగా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కసరత్తు చేస్తోందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎ్‌సగా పేరు మార్చాక తెలంగాణలో అధికారం కోల్పోవడం, రాష్ట్రంలో రోజురోజుకూ పార్టీ గ్రాఫ్‌ తగ్గుతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్‌ఎ్‌సను.. బీఆర్‌ఎ్‌సగా మార్చాలని ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకొనే పార్టీ పేరును ఎవరినీ అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే’’ అంటూ ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఓ మోస్తరు నాయకుల వరకు అధిష్ఠానాన్ని నిలదీస్తూ వస్తున్నారు. దీంతో జనానికి పార్టీ దూరం కావడానికి ఇదే ప్రధాన కారణమని భావించిన అధిష్ఠానం.. పేరు మార్పే శరణ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును, అధికారాన్ని తెచ్చిపెట్టిన టీఆర్‌ఎస్‌ పేరునే జనంలోకి తీసుకువెళ్లేలా.. బీఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎ్‌సగా మార్చేందుకు అనువైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నం వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎ్‌సగా మార్పు చేయడమా? లేదంటే.. ఇతర రాష్ట్రాల్లో కొనసాగించేలా జాతీయ రాజకీయాల కోసం బీఆర్‌ఎ్‌సను, తెలంగాణలో మాత్రమే కొనసాగించేందుకు టీఆర్‌ఎస్‌ పేరును మళ్లీ పొంది.. రెండు పార్టీలను నిర్వహించాలా? అన్నదానిపై కూడా చర్చ జరుగుతు న్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు, చట్టపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే బీఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎ్‌సగా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి తమ మార్క్‌ సెంటిమెంట్‌ రాబట్టగలుగుతామని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 25 , 2024 | 05:43 AM