Share News

ఊపిరి తీస్తున్న పిడుగులు!

ABN , Publish Date - May 20 , 2024 | 11:35 PM

వికారాబాద్‌ జిల్లాలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగి పడగా, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

  ఊపిరి తీస్తున్న పిడుగులు!
: మృతి చెందిన మేకలు

జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలు వాన

పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు, ఐదు మేకలు, గేదె మృతి

తడిసిన ధాన్యం.. దెబ్బతిన్న ఉల్లి పంట

విరిగిపడిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

దుద్యాలలో వడగండ్ల వర్షం

తాండూరురూరల్‌/కొడంగల్‌రూరల్‌/బొంరా్‌సపేట్‌/మర్పల్లి/కొడంగల్‌/దౌల్తాబాద్‌/తాండూరు/యాలాల, మే20 : వికారాబాద్‌ జిల్లాలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగి పడగా, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తాండూరు మండలంలోని నారాయణపూర్‌, మల్కాపూర్‌, సంకిరెడ్డిపల్లి గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గోనూరు, చెంగోల్‌, బెల్కటూర్‌లో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. డీసీఎంఎస్‌ అధికారులు ధాన్యం బస్తాలు తూకం వేయకపోవడంతో ధాన్యం తడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతాపూర్‌గ్రామ శివారులో మూడు చెట్లు నేలకొరిగాయి. దుద్యాల మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వడగండ్ల వర్షం కురిసింది. పోలెపల్లి గ్రామంలో 3 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా దుద్యాల మండల పరిధిలోని వాల్యనాయక్‌ తండాలో 12 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఓ స్తంభం ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుద్యాల గ్రామంలో జిల్లా పరిషత్‌ పాఠశాలతో పాటు గౌరపు మంగమ్మ ఇంటి ముందు వేప చెట్టు విరిగి పడింది. అదే విధంగా కొడంగల్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం గంట పాటు భారీ వర్షం కురిసింది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వాతావరణం చల్లబడటంతో పాటు వ్యవసాయ పనులకు దోహదం చేస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కుళ్లిన ఉల్లి

అకాల వర్షాలతో మర్పల్లి మండలంలోని ఉల్లి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పొలాల దగ్గర నిల్వ చేసిన ఉల్లి పంట కుళ్లిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మర్పల్లి మండలంలోని పంచలింగాల, పట్లూర్‌, దారులపల్లి, మొగిలిగండ్లు, తుమ్మలపల్లితో పాటు తదితర గ్రామాల్లో ప్రతీ ఏటా అధిక సంఖ్యలో ఉల్లి పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది కూడా దాదాపు వేయి ఎకరాలకు పైగా సాగు చేశారు. పంట దిగుబడి వచ్చి పొలాల దగ్గరే నిల్వ ఉంచారు. కొన్ని రోజులుగా మార్కెట్‌లో ఉల్లి పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు పొలాల గట్లపై ఉల్లిగడ్డ మల్లు తయారు చేసుకొని నిల్వ ఉంచారు. కురిసిన వానకు ఉల్లి పంట కుళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఊపిరి తీసిన పిడుగులు.. ఇద్దరు మృతి

పిడుగు పాటుకు ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందిన సంఘటన మరవక ముందే మరో వ్యక్తి పిడుగు పాటు గురై మృతి చెందారు. బాలుడికి గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో పాత తాండూరుకు చెందిన పూరే శేఖర్‌ (40) ఇంటి నుంచి బహిర్భుమికి వెళ్లారు. వర్షం వస్తుండడంతో దగ్గరలోనున్న చెట్టు కింద వెళ్లి కూర్చున్నారు. ఆ చెట్టుపై పిడుగు పడింది. శేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందగా అదే ప్రాంతంలో క్రికెట్‌ ఆడడానికి వచ్చిన బాలుడు హన్మంతు పిడుగు పాటుకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు స్థానికులు కలిసి శేఖర్‌, హన్మంతులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శేఖర్‌ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించగా, బాలుడు చికిత్స పొందుతున్నాడు. అక్కడే కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. అంతేకాకుండా రుద్రారం గ్రామానికి చెందిన పట్లోళ్ల అపర్ణకు చెందిన పొలం చుట్టూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన దొంతరమోని భగవంతు ఫెన్సింగ్‌ పనులు చేస్తుండగా ఆదివారం రాత్రి వర్షం కురుస్తుండగా పొలంలో పిడుగు పడటంతో భగవంతు కిందపడిపోయాడు. గమనించిన తోటి కూలీలు, అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ బాలకిషన్‌ తెలిపారు.

ఐదు మేకలు, గేదె మృతి

పిడుగు పడి ఐదు మేకలు మృతి చెందిన సంఘటన యాలాల మండల పరిధిలోని హజీపూర్‌ శివారు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మొగులప్ప తనకున్న మేకలను మేత కోసం తోలుకుని అడవికి వెళ్లాడు. వర్షంతో పాటు ఉరుములు , మెరుపులు రావడంతో మేకలన్ని ఒక చెట్టు కింద నిలబడగా మొగులప్ప మరో చెట్టు కింద ఉన్నాడు. ఈక్రమంలో పిడుగు పడి చెట్టు కింద ఉన్న ఐదు మేకలు మృతి చెందాయి. దౌల్తాబాద్‌ మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తిమ్మారెడ్డిపల్లి అనుబంధ గ్రామం బంగ్లా తండాలో పిడుగుపడి లక్ష్మనాయక్‌కు చెందిన పాడి గేదె మృతి చెందింది.

Updated Date - May 20 , 2024 | 11:35 PM